కొంతమంది నిద్ర లేవగానే వేడివేడిగా కప్పు కాఫీ, గుక్కెడు టీ తాగితే కానీ ఆరోజును ప్రారంభించరు. అది మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని తెలిసినా దానికి దూరంగా ఉండటం సాధ్యం కాని పని. ఎక్కువరోజులు ఆరోగ్యంగా ఉండాలంటే టీకి బదులు పండ్ల జ్యూస్‌లు తాగమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి గుండెను కాపాడుతూ మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆ మార్నింగ్ డ్రింక్స్ గురించి ఓ లుక్కేద్దాం..
గ్రీన్ టీ: ప్రతిరోజూ ఉదయం గ్రీన్ టీ తాగడం గుండెకు చాలా మంచిది. వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి గుండెను కాపాడతాయి. తద్వారా హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.
దానిమ్మ జ్యూస్: ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హృదయ సంబంధ సమస్యలు రాకుండా చూసుకుంటాయి.
బీట్రూట్ జ్యూస్: బీట్రూట్లో నైట్రేట్స్, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపుచేసి గుండెను బలంగా ఉంచుతాయి. గుండెపోటు రిస్క్‌ను తగ్గిస్తాయి.
టమాటా జ్యూస్: ఈ జ్యూస్‌లో లైకోపీన్ ఉంటుంది. దీనిలోని శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్ గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నారింజ జ్యూస్: నారింజ పండ్లలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను బలంగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని సైతం పెంచుతాయి.
నిమ్మరసం: ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని తాగడం చాలామంచిది. ఇది ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి గుండెను రక్షిస్తుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా చేస్తుంది.