కాలానికి తగినట్టు దుస్తులను ధరించినట్టే కాలానికి తగినట్టు ఆహార నియమాలనూ మార్చుకోవాలి. ఎండాకాలం వాతావరణానికి తగినట్లుగా ఆహార నియమాలను మార్చుకోకపోతే అనారోగ్యం పాలవక తప్పదు. ఎండాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం తొందరగా నీటిని కోల్పోతుంది. అందువల్ల శరీరానికి నీటిని అధికంగా అందించే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ఇవి పాటిస్తూనే కొన్ని రకాల ఆహార పదార్థాలను కొంతకాలం తినకుండా ఉంటే మంచిది. వేసవిలో తినకూడని ఆహార పదార్థాలగురించి తెలుసుకుందాం.
చిరు తిళ్లలో ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉప్పు అధికంగా ఉపయోగిస్తారు. చిప్స్, క్రాకర్స్, జంతికల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే శరీరంలో డీహైడ్రేషన్ (నీటిని కోల్పోవడం) పెరుగుతుంది. దీంతో దాహం ఎక్కువవుతుంది. అప్పుడు చల్లని పానీయాలు తాగాలనే కోరిక పుడుతుంది. శరీరంలోకి సోడియం ఎక్కువవడం వల్ల నీరు కూడా చేరుతుంది. అవి పాదాలు, కాళ్లకు చేరి ఇబ్బందులు కలిగిస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్ ప్రస్తుత కాలంలో ప్రాసెస్డ్ ఫుడ్ ఇష్టపడే వాళ్లే ఎక్కువ. పిజ్జా, బర్గర్, శాండ్విచ్ వంటి రెడీ టు ఈట్ ఫుడ్ అందరికీ అందుబాటులో ఉంటోంది. మాంసాహారాన్ని తీసుకునే వారి సంఖ్యా ఎక్కువే. ప్రాసెస్ చేసిన మాంసాహారంలో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. సోడియం ఎక్కువగా చేరితే శరీరం నీటిని కోల్పోవడం (డీహైడ్రేషన్) ఎక్కువవుతుంది.
వేసవిలో కారం, మసాలాలను ఎక్కువగా వాడకూడదు. కారంగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది. అందువల్ల శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది.
వేసవిలో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. వేసవి తాపం నుంచి బయటపడేందుకు కొంతమంది బీరు తాగుతున్నారు. బీరుతోపాటు కాక్టెయిల్స్ కూడా ఎక్కువగా తాగుతున్నారు. వీటిలో ఆల్కహాల్తోపాటు చక్కెర, ఉప్పు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చెడు చేస్తాయి.