రామ్‌చరణ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ‘చికిరి’ పాట సోషల్‌మీడియాలో రికార్డు స్థాయి వీక్షణలను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేయబోతున్నారు. మార్చి 2వ తేదీన ‘రై రై రా రా’ అనే రెండో పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో రామ్‌చరణ్ పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ఆటకూలీ పాత్రను పోషిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ స్వరకల్పనలో పాటలన్నీ అద్భుతంగా తయారయ్యాయని, మ్యూజికల్‌గా కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సాన.