Folk Singer Relare Rela Archana | ఆమెకు పాటంటే తల్లి లెక్క. కానీ పెండ్లితో పాట మూగవోయింది. పాడకుండా ఉండలేని పరిస్థితి. బాధతో రాయడం మొదలుపెట్టింది. ఐదేండ్ల విరామం. ధైర్యం చేసింది. పాడతానని గట్టిగా చెప్పి ఇంట్లో ఒప్పించింది. యూట్యూబ్‌లో జానపద జల్లులు కురిపిస్తున్న రేలారే అర్చన పాటల ముచ్చట..
మా తల్లిగారిది కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం కొండాపూర్. నా పాటకు బీజం పడింది అక్కడే. అమ్మ సిద్ధేశ్వరి. నాన్న భద్రప్ప. నాన్న నా పాటకు గురువైతే, అమ్మ ఆ పాటను ప్రపంచానికి తెలిసేలా చేసింది. మా ఇల్లు ఒక కళానిలయం. మా గుమ్మం స్వాగతద్వారం. అక్కడ శిక్షణ పొంది ఎంతోమంది నైపుణ్యం సంపాదించిండ్రు. మరెంతోమంది జీవితసారం తెలుసుకున్నరు. అదే కాంపౌండ్ నుంచి ఫోక్ సింగర్‌గా కెరీర్ మొదలువెట్టడం గర్వకారణంగా అనిపిస్తున్నది.
నాన్నకు జానపద కళపై మంచి పట్టున్నది. బాగోతాలు, చిడతల రామాయణం, బ్రహ్మంగారి చరిత్ర, లవకుశ వంటి నాటక ప్రదర్శనల కోసం కళాకారులను తయారుచేస్తుండేవాడు. చుట్టుపక్కల కూడా నాన్నకు మంచిపేరున్నది. మా ఊరివాళ్లే కాదు పక్కూరివాళ్లు కూడా నాటక సూత్రధారిగా నాన్ననే ఎంచుకునేవాళ్లు. తెల్లవారుజామునే లేచి, పూజ చేసుకొని భోజనం చేద్దామనేలోపు పదీ పదిహేను మంది మా ఊరోళ్లో, పక్కూరోళ్లో వస్తుండె. ఏ నాటకం ప్రదర్శించాలె? ఎవరెవర్ని చేర్చుకోవాలె?.. తదితర విషయాలు మాట్లాడుకునే వాళ్లు. ఇంట్లో మాట ముచ్చట అయిపోయినంక రిహార్సల్స్ దగ్గరికి వెళ్లేవారు. వాళ్లు చేస్తుంటే మేం చూసేవాళ్లం. ఆ పాత్రలను అనుకరిస్తూ శ్లోకాలు, కీర్తనలు పాడేవాళ్లం. తెలియకుండానే పాత్రలలో లీనమైపోయే వాళ్లం. అదో కొత్త ప్రపంచంలా అనిపిస్తుండె.
అప్పుడు నాకు ఆరేడేండ్లు. ఏదో ఒక ప్రదర్శన జరుగుతున్నది. పాత్రల ప్రవేశానికి ముందు నాన్న ఒక కీర్తన వినిపించిండు. చప్పట్లు, కేరింతలు మార్మోగినయి. అది నా మనసులో నాటుకుపోయింది. నాన్నకు తగ్గ బిడ్డెను అనిపించుకోవాలె అనుకున్న. మా అన్నపై కూడా నాన్న ప్రభావం ఉంది. నాకంటే ముందుగనే పాడటం నేర్సిండు. ఒకవైపు నాన్న, మరొకవైపు అన్న. ఇద్దరూ పాడినవి ఇంట్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. అది చూసే ‘గడికింత గంజాయి తాగుతడు’ అనే పాట నేర్పించిండు నాన్న.
మా అత్తగారిది నారాయణ్‌ఖేడ్. నార్సింగికి వచ్చి సెటిలయ్యిండ్రు. మా ఆయన ఉమాశంకర్ కూకట్పల్లి శివాలయంలో పూజారి. అయితే పెండ్లి తర్వాత పాటలు పాడటానికి మావాళ్లు ఒప్పుకోలేదు. ఐదేండ్లు పాటకు దూరంగ ఉన్న. పాట నాకు తల్లిలాంటిది. రోజూ బాధపడేదాన్ని. ఇంట్లో ఉంటూనే ‘బాయి మీదా గిరుకా గిరుకోలెవుంటా నన్నుజూసిపోరో’,
‘కామరెడ్డి కటారిబట్ట.. మిరపగుడ్డా మిషీనికుట్టు’ వంటి పాటలు రాసిన. ఓ రోజు ధైర్యం చేసి అడిగిన. మొత్తానికి ఒప్పుకొన్నరు. గజ్వేల్ వేణన్న నంబర్ దొరకవట్టి ఫోన్లో పాట వినిపించిన. నెల రోజుల తర్వాత పాడేందుకు అవకాశం ఇచ్చిండు. యూట్యూబ్‌లో మొదటగా ‘సిటీ సీరెలన్నడె.. సిలకు రైకెలన్నడే’ పాట పాడిన. మంచి సక్సెస్ అయ్యింది. ఇక వరుసగా అమూల్య స్టూడియోలో ‘యాడికీ నన్ను తోలవోకు ఎక్కువా మాటలాడవోకు’, ‘పట్టూగుడ్డని సుట్టాజుట్టి పాలాబిందె నెత్తినవెట్టి’, ‘ఓ సందమామయ్యా ఓ నీలదారుడ’, ‘పట్టాగొలుసు మీద నాదొక్క యెమునము’ వంటి పాటలు పాడిన. కాయితోజు స్టూడియో, లలిత స్టూడియోస్, మహీ ఫోక్బీట్స్లో ‘సుట్టాల పండగాల చూసిండు నన్నూ చూసిండు నన్నూ’, ‘కామరెడ్డి కటారిబట్ట.. మిరపగుడ్డా మిషీనికుట్టు’, ‘బాయి మీదా గిరుకా.. గిరుకోలెవుంటా నన్నుజూసిపోరో’ పాడిన. నాన్న నేర్పించిన కళను సార్థకం చేయడమే నా లక్ష్యం.
పాటే ప్రపంచంగా బతుకుతా.
అమ్మ ‘ఇందిరా క్రాంతి పథం’ (ఐకేపీ) మహిళా సమాఖ్యకు జిల్లా అధ్యక్షురాలిగా చేస్తుండె. కళాబృందం కూడా వీరితో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలి. రోజూ ఇంట్లో నా పాటలు విన్న అమ్మ నన్ను అష్ట గంగాధరన్న దగ్గర శిక్షణకు పంపింది. ఏ పాటను ఎట్ల పాడాలె? ఎట్ల ఎత్తుకోవాలె అన్నది అక్కడే నేర్చుకున్న. అప్పుడే ‘రేలారె రేలా’ నాలుగో దరువు కోసం ఆడిషన్స్ జరుగుతున్నయి. గంగాధరన్న సహకారంతోనే వెళ్లిన. అక్కడ ‘యాడికీ నన్ను తోలవోకు.. ఎక్కువా మాటలాడవోకు’ పాట పాడిన. నేను పాడే విధానం బాగుందని సెలెక్ట్ చేసిండ్రు. తొలి వారంలోనే తోటి సింగర్స్, జడ్జీలు, యాంకర్స్.. మన్ననలూ పొందిన. ‘బండిమీద బంగ్లంటీవి ఓరి గంగరాజు’, ‘దూరం దూరం దూరం సఖియా’, ‘యాడికీ నన్ను తోలవోకు’ వంటి పాటలతో మెప్పించిన. ఐదు వారాల తర్వాత ఆరోగ్య సమస్య వల్ల పదాలు తడబడటంతో ఎలిమినేట్ అయిన. రేలారే తర్వాత నాకు పెండ్లి చేసిండ్రు.
… దాయి శ్రీశైలం
“పాఠాలతో పాటు పాటలు నేర్పిస్తూ పల్లె పాటల చిరునామాగా మారిందీమె !!”
“ఒక్కసారి ఓడిపోగానే అప్పటిదాకా మెచ్చుకున్నోళ్లే ఇదేనా నీ టాలెంట్ అంటూ ఎగతాళి చేశారు”
Folk Singer Srinidhi | పాటలో ఉన్న కిక్ లాయర్ కావాలన్న కలను మరిపించింది !!”