Folk Singer Marsukola Kalavathi | ఆమె ఒక్కరే. కానీ వందలయేండ్ల కళను బతికిస్తున్నది. గోండుల ఇంట్ల గొప్ప పాటయి వెలుగుతున్నది. మహిళలెవ్వరూ మళ్లిచూడని ‘తోటి’ కళను కండ్లకద్దుకొన్నది. భుజాన డక్కీ వేసుకొని.. చేతిలో కిక్రీ పట్టుకొని.. జోలె సర్దుకొని.. పల్లె పల్లెకూ తిరుగుతున్నది! ఆదివాసీ చారిత్రక, సాంస్కృతిక కళా వైభవం ఉట్టిపడేలా గోండీ పాటలు పాడుతున్న మర్సుకోల కళావతి పాటల ముచ్చట..
మాది ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామం. మమ్మల్ని తోటివాళ్లని అంటరు. మేం గోండులకు కింది కులం. గోండులు, కొలాముల సంస్కృతి, చరిత్రను తెలిపే గాథలు, పురాణాలు, వీరుల కథలను పాడతాం. మేం ఏవైనా ఊర్లకు పోతే అంతా ఒక్కతాన గుమిగూడి పాటలు పాడించేటోళ్లు. పూటకు లేకున్నా పాటే గోండుల ఇండ్లల్ల సావులకు, బతుకులకు మేం పొయ్యేదాంక వాళ్లేదీ ముట్టుకోరు. మా ‘సానా’ పాట వినకుండా సచ్చిన పీనిగెనుకూడా లేపరు. నాలుంసగన బీడీ, ఇంద్రాయి కథ, యేత్మనూర్ కథ, జంగుబాయి కథ, మహాభారతం, శివుని పాట, నాగోబా పాటలు ఎక్కువగా పాడుతం. ఇవే మాకు బువ్వ పెట్టేది. అసొంటి వందల పాటలు నేర్చుకున్న. ఆదెరువు లేదని చానామంది ఈ కళను వదిలేసిండ్రు. మా నాయిన తొడసం భీంరావ్ మాత్రం దీంట్లెనే బతుకుదెరువు దేవులాడుకున్నడు. కళ బతకాల్నని పబ్బతి కట్టిండు. పూటకు లేకున్నగానీ పాటను పడగొట్టొద్దని చెప్తుండె. ఏ ఊరికి వొయ్యినా నన్ను, తమ్ముడిని తోల్కపోతుండె. అమ్మ హీరాబాయి నాయినకు కోరస్ అందుకుంటుండె. మాకు చేన్లు లేవు, చెలకల్లేవు. పాట పాడిన్నాడే ఇంత ముద్ద
దొరికేది. కడ్మ రోజుల్ల మందులు, మాకులు తెంపనీకె పోతుండె. పేదరికమే అయినా అమ్మానాయిన మమ్ములను మంచిగ చూసుకున్నరు.
ఏ ఊళ్లె పొద్దూకితే ఆ ఊళ్లెనే తల వొందిస్తం. ఇంత సంపాదిస్తం, అంత కూడవెడ్తం అని నిక్రెం ఉండదు. ఉంటే తింటం. లేకుంటే ఉపాసముంటం. ఒకసారి చీకటివడ్డది. ఇంటికొచ్చె తొవ్వల మా తమ్ముడిని నాగుంబాము కాటేసింది. ఎంత తిప్పలవడ్డా నాయిన మా తమ్ముడిని బతికించుకోలేక పోయిండు. తమ్ముని మీద నాయినకు చానా ప్రేమ. తనతోనే ఈ పాటలు, పద్యాలు, భజనలు ఆగిపోతయేమో అని రందివెట్టుకున్నడు. ‘ఏందే నాయినా పొయ్యినోడు తిరిగొస్తడా? నువ్వే గిట్ల బాధవడితే అమ్మ పరిస్థితేంది? నా పరిస్థితేంది?’ అని అడిగిన. ‘సూడు బిడ్డా! నాకు వచ్చేది ఒకటే పని. నాలుగైదేండ్ల వయసు పిలగానిగా ఉన్నప్పుడు ఈ కళకు సోపతయిన. నా తర్వాత తమ్ముడికి నేర్పిద్దామని అనుకున్న. వాడేమో నడిమిట్లనే పానం పోగొట్టుకునే. ఇగ నువ్వే నాకు కొడుకైనా బిడ్డయినా. ఆ పాటలేవో నీకు నేర్పిస్తా. నా బాధ్యత నీ చేతుల పెడత’ అన్నడు. నాకేం సుదురాయించలేదు. కొసరో పిసరో కొంత సదువుకోవాలె, విద్యా బుద్ధులు నేర్వాలె అనుకున్న. నాయిన అట్లనేసరికి నేనేమీ చెయ్యలేకపోయిన. ‘అట్లనేనే. నువ్వు చెప్పినట్టే తోటి పాటలు నేర్సుకుంటా’ అని మాటిచ్చిన. పద్నాలుగేండ్ల వయసులో నాకు పెండ్లి చేసిండ్రు. మా ఆయన పేరు నారాయణ్. నాయిన నన్నే వారసురాలిగా భావించిండు కాబట్టి, మా ఆయినను ఇరిటం తెచ్చుకుండు. ఆయనకు పాటలు రావు. నేను పాడుతుంటే కిక్రీ, డక్కీ కొడుతడు. పాటలు లేనప్పుడు కూలీ పనికి పోతడు. ఇప్పుడు చాతగాకుంట అయ్యింది. నాతో వచ్చుడు బంద్‌జేసి వాళ్లయీ వీళ్లయీ మ్యాకల గుంపు కాస్తున్నడు.
మాకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డెలు. మా నాయిన అప్పజెప్పిన పని నాతోనే ఆగిపోవద్దు. నా బిడ్డెలకు నేర్పించాలె అనుకున్న. కానీ చదువు ఆగమైతదేమో అనుకొని మొదట అడగలేదు. నా చిన్న కొడుకు కిష్ట్కి పాటలంటే ఇష్టం. ఏడో తరగతి దాక చదివిండు. నాతో పాటు పల్లెలు తిరుక్కుంటా పాటలు పాడుతుండు. పెద్ద బిడ్డె, పెద్ద కొడుకు పన్నెండో తరగతి దాకా చదివిండ్రు. చేతిల ఐదొందల రూపాయల్లేక డిగ్రీ చదివించలేక పోయిన. కిష్ట్ నాతో కలిసి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్‌లోని గోండు పల్లెలకు వస్తడు. మేం బాజాలు, కిక్రీ మోగించుకుంటూ ముంగట నడిస్తేనే వాళ్లు గోండుల దేవుడికి పండగ జరుపుతరు. దసరా పండుగకు చేన్ల మీదికెల్లి తీసిన కందులు, జొన్నలు, పెసర్లు కొర్రలతో పులగం వండి దేవుడికి నైవేద్యంగా పెడతం. ఆ తంతు జరిగినంకనే వాళ్లు కొత్త పంటను తింటరు. నుదిటిపైన సూర్య, చంద్రుల సుక్కబొట్లేయడం కూడా మా ఆచారంలో భాగమే. గోండుల ఆడిబిడ్డెల పెండ్లిల్లకు మేం సుక్కబొట్టు వేస్తుంటాం.
తరాల నాటి కళా వారసత్వాన్ని, తోటి పాటనూ బతికిస్తూ వస్తున్న. ఆ పనిలో పడి నా బతుకును చక్కదిద్దుకోలేకపోయిన. ఇయ్యాల చేతనైతుంది కాబట్టి పల్లెల పొంటి తిరుగుతున్న. రేపటెల్లుండి పరిస్థితి ఎట్లుంటదో? ఇన్నేండ్లు కాపాడుకుంటా వచ్చిన కళ ఏమైతదో? అనిపిస్తది. నా కళను గుర్తించి అవార్డు అందజేసిన తెలంగాణ సర్కారు, నాకొక ఆదెరువు కూడా చూపిస్తే నేను బతకడమే కాదు, కళ కూడా తరతరాలు బతుకుతది.
– దాయి శ్రీశైలం
ఫొటోలు : ముస్కు రాజ్‌కిరణ్ రెడ్డి
“Mukunda | మంచి ఫోక్ సింగర్ కావాలన్నదే లక్ష్యం.. పెద్ద సినిమాకు పాడటం నా డ్రీమ్”
“Telu Vijaya | రెండు పీజీలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాటతో వచ్చింది”
Marupaka Sanjana | మల్లెమొగ్గలా తీరు.. రాధమ్మ బంగారు బొమ్మా!”
“Janaki Srinivas | మూడో తరగతిలో పాడిన పాట ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది”