Folk Singer Marupaka Sanjana | మూడు తరాల పాట అది. అమ్మమ్మ పాడుతుంటే అమ్మ పాడింది. అమ్మను అనుకరిస్తూ అమ్మాయి పాడుతున్నది. తరాలు మారినా జానపదం మాత్రం మారలేదు. వడ్లు దంచే కాలం నుంచి యూట్యూబ్ జమానా వరకు అదే ఉత్సాహం. అలనాటి పల్లె పాటలకు అందాన్ని తీసుకొస్తూ అందర్నీ మెప్పిస్తున్న మార్పాక సంజన పాటల ముచ్చట!
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్. ఓనమాలతో పాటు పాట కూడా నేర్చుకున్న. చిన్నప్పటి నుంచీ నాకు సంగీతమంటే జానపదమే. ఇంట్లో బతుకమ్మ పాటలు వింటూ పెరిగిన. ఒంటరిగా పాడుకునే దాన్ని. కానీ బయటికి మాత్రం పాడకపోయే దాన్ని. జానపద వారసత్వంలో నాది మూడో తరం. మొదలు మా అమ్మమ్మ పాడింది. తనకు రాని పాటలంటూ లేకపోతుండె. అవి విని అమ్మ నేర్చుకున్నది. అమ్మ పాటలను అనుకరిస్తూ నేను నేర్చుకున్న. మా అమ్మ పల్లెపాటల నిఘంటువు. చిన్నప్పటి పాటలను యాదికివెట్టుకొని ఇప్పటికీ పాడుతది. పాటంటే బాగా ఇష్టపడుతది. గడ్డి మీద, ఒడ్డు మీద, పక్షి మీద, పశువుల మీద, బంధాల మీద, భార్యాభర్తల అనుబంధం మీద.. ఎన్నో పాటలు పాడుతది.
నాన్నకు కూడా నా పాటలంటే ఇష్టం. నేను ఇంట్లో ఏదంటే అది పాడుత. కానీ, స్టేజీ ఫియర్ ఎక్కువుండె. ‘నీ దగ్గర మంచి పాటలున్నయి. మంచి గొంతు ఉంది. ధైర్యంగ పాడితేనే గుర్తింపొస్తది’ అని ప్రోత్సహిస్తుండె. నన్ను పెద్ద సింగర్‌గా చూడాలన్నది నాన్న కోరిక. ఆరేండ్ల కిందట.. నాన్న ఉన్నట్టుండి కుప్పగూలిండు. డాక్టర్లు గుండెపోటు అని చెప్పిండ్రు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నాన్న మాకు దూరమయ్యిండు. నాన్న ఎప్పుడూ… ‘బిడ్డా నువ్వు పెద్దపెద్ద ప్రోగ్రామ్స్‌లో పాడాలె. సినిమాలకు పాడుతుంటే చూడాలన్నది నా కోరిక. నీకేం అడ్డు చెప్ప. ఏం చేస్తవో నీ ఇష్టం. నువ్వు మాత్రం సింగర్వి కావాలె..’ అంటుండె. నాన్న చనిపోయినప్పటి నుంచి కుటుంబ భారం అమ్మమీద పడింది. మాకు పొలాలు, జాగలు లేవు. అమ్మ కూలి పని చేసుకుంట మమ్మల్ని చదివించింది.
అమ్మ కష్టం చూస్తుంటే ఈ పాటలు అవసరమా అనిపించేది. కానీ నేను మంచి సింగర్ కావాలనేది అమ్మ లక్ష్యం కూడా. అందుకే కష్టమైనా, నష్టమైనా పాటతోనే ప్రయాణించాలని అనుకున్న. నా పాటకు ఇంటర్లో పదును పడింది. కాలేజీలో చేరిన కొత్తలో సాంస్కృతిక కార్యక్రమం పెట్టిండ్రు. పాటల పోటీ కోసం నాకు తెలవకుండనే దోస్తులు నా పేరు ఇచ్చిండ్రు. స్టేజి మీదికి రావాల్సిందిగా అనౌన్స్మెంట్ వినిపించినా నేను వెళ్లలేదు. దీంతో దోస్తులే నన్ను స్టేజీపైకి తోసేసిండ్రు. కండ్లు మూసుకొని పాడిన. నాకే మొదటి బహుమతి వచ్చింది.
యూట్యూబ్‌లో జానపదాల హవా నడుస్తున్నది. అమ్మ దగ్గర సేకరించిన పాటలు, ట్యూన్స్ నా దగ్గర చాలానే ఉన్నయి కాబట్టి, ఈజీగా అవకాశం వస్తుందిలే అనుకున్న. కానీ నేననుకున్నంత సులభం కాదని ఆలస్యంగా తెలిసింది. నేను చేయని ప్రయత్నం లేదు. అడగని మనిషి లేడు. ఏదైనా పాట రిలీజైతే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేసి అడిగేదాన్ని. అందరూ చూద్దాం, చేద్దాం అనేవాళ్లే. యూట్యూబ్ పరిస్థితే ఇట్లా ఉంటే, సినిమాల్లో ఇంకెట్ల ఉంటుందో అనిపించింది. ఇది అయ్యేపని కాదనుకున్న. సింగర్ బొడ్డు దిలీప్ మా బంధువు. పీఎం క్రియేషన్స్ పార్వతి మహేశ్‌కు తనే నన్ను పరిచయం చేసిండు. అతనికి నా దగ్గరున్న పాటల గురించి చెప్పిన. ‘ఎన్నడురాని తమ్ముడూ జిలజిలా వచ్చినాడక్కా.. ఊరూరు గ్రామమున్నాది దియ్యా దీపమున్నదిరా’ పాట వినిపించిన. ‘ఇంతమంచి పాటలు, ట్యూన్స్ ఉన్నయా నీ దగ్గర. ఒక పాట చేద్దాం’ అన్నడు. ‘మల్లెమొగ్గల తీరూ రాధమ్మ బంగారు బొమ్మా.. మనసాయె నిన్ను సూడంగో బంగారు బొమ్మా’ పాట పాడే అవకాశం ఇచ్చిండు. దీనికి ట్యూన్ నేనే ఇచ్చిన. బుల్లెట్టు బండి పాట తర్వాత అంతగా వినిపిస్తున్నది మా రాధమ్మ సాంగ్. ఈ పాటకంటే ముందు పార్వతి మహేశ్‌కు ‘నీ మొగాడు మేనింజారు మందిలరాడు లలీతో’ పాటకు ట్యూన్ ఇచ్చిన. ఈ మధ్య ‘సానీ సానీగున్నవానీ సాటూగ జూసింది మొదలు’ పాట పాడిన. ఇంకా రిలీజ్ అయ్యేవి ఉన్నయి. ఇప్పుడు నాకో ధైర్యం వచ్చింది. ‘నాన్నలేడు, ఆస్తుల్లేవు, చదువుకొని పెండ్లి చేసుకో ఈ పాటలేంది’ అన్నవాళ్లే ఇప్పుడు నా పాటలను మెచ్చుకుంటున్నరు. ‘నీ గొంతు బాగుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ నిన్ను గొప్ప సింగర్‌గా చూడాలనుకున్న మీ అమ్మానాన్న కలను సాకారం చేసుకో’ అని ప్రోత్సహిస్తున్నరు.
నాన్న లేడనే వాస్తవంలో నుంచి బైటపడటానికి చాలా టైంపట్టింది. కుర్చీలో చూస్తే కనిపించడు. మంచం దగ్గర పిలిచినా పలకడు. మా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేం. ఏ బరువూ తెల్వకపాయె. ఎట్ల బతకాల్నో నేర్పకపాయె. ఏ చిన్న అవసరమున్నా దర్జాగా అడిగితే నాన్ననే చూసుకునేది. నాన్న లేకుండా బతుకుడు కష్టమే అనిపించి దినాం ఏడుస్తూ కూసునేటోళ్లం. ‘ఏడ్సుకుంట ఎన్నిరోజులు కూసుందం? మనం చేసే పనిలో నాన్నను తలుచుకొని కష్టవడుదాం. మన రాత ఎట్లుంటే అట్లయితది బిడ్డా’ అని అమ్మనే ధైర్యం చెప్పింది.
– దాయి శ్రీశైలం
Janaki Srinivas | మూడో తరగతిలో పాడిన పాట ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది”
“Bhavani Sangareddy | నా అందం సూడుబావయ్యో!”
“మట్టిలో మాణిక్యం సాయికుమార్‌గౌడ్..పాటలతో అందరి ప్రశంసలు అందుకుంటున్న గద్వాల బాలుడు!!”
“అమెరికాలో సెటిలయ్యే ఛాన్స్ ఉన్నా.. పాటే ప్రాణం అంటున్న శ్రీజ”