Folk Singer Lavanya Ravinder | ‘రాత్రి బడి’ ఆమెకు అక్షరం నేర్పింది. పాటపై ఇష్టం పెంచింది. పెండ్లి ఆ పాటను పంజరంలో బంధిస్తే.. పిల్లలు విముక్తి కల్పించిండ్రు. ఇప్పుడు అదే పాట స్వేచ్ఛా గీతమై అంతటా వినిపిస్తున్నది. జనం గుండెలను హత్తుకునే జానపదమై మారుమోగుతున్న జనగామ లావణ్యా రవీందర్ పాటల ముచ్చట..
మా తల్లిగారి ఊరు కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి. అత్తగారి ఊరు శంకరపట్నం దగ్గర ఇప్పలపల్లి. నాలుగైదేండ్ల వయసు నుంచీ పాడుతూనే ఉన్నా. తోటి పిల్లలు బడికివోతుంటె నేను ఆ పనీ ఈ పనీ చేసుకుంట ఉండేదాన్ని. ఆడపిల్లలకు చదువెందుకు? అనేది మావోళ్ల ఉద్దేశం. చదువుకు దూరమైనంక కొన్నిరోజులు తమ్ముండ్లను చూసుకున్న. కొన్నిరోజులు ఆవులు కాసేందుకు పోయిన. నాయిన పశుల కాడికొస్తే నేను అమ్మతోటి పొలం పనికి పోతుంటి. నాట్లేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు అమ్మలక్కలు పాడే పాటలు నాకు బాగా నచ్చేవి. నాకూ నేర్చుకోవాలె అనిపించింది. నా పాట విని ‘మీ అమ్మ లెక్కనే పాడుతున్నవ్. ఇంకా బాగా పాడాలె’ అని వాళ్లూ వీళ్లూ అంటుంటే అమ్మ పాట గురించి తెలిసింది. మా అమ్మ పాడుతదని అప్పటిదాక నాకు తెల్వదు.
‘బడికి ఎట్లా పోలేదు. కనీసం మాపటి బడికైనా పోతా’ అంటే పంపిండ్రు. నా లెక్క బడికి పోనోళ్లు, చదువుమీద ఖాయిష్ ఉన్న పెండ్లయినోళ్లు.. ఇట్లా అన్ని రకాల వయసుల వాళ్లూ వస్తుండె. అది నాకు చానా అక్కరకొచ్చింది. అంతో ఇంతో చదువు ఒంటబట్టింది. పుస్తకాలకు పుస్తకాలు చదివేటంత కాదుగానీ ఇట్లనే ఏదైనా బస్సు బోర్డో, పేపరో సూడంగనే విషయమేందనేది గుర్తువడతా. అక్కడే అక్షర జ్ఞానంతో పాటు జీవిత జ్ఞానం కూడా తెలిసింది. అన్ని రకాల వయసువాళ్లు ఉంటుండె. తీరొక్క ముచ్చట్లు నడుస్తుండె. అందరం తలా ఒక పాట పాడేటోళ్లం. పాటద్వారా ఏదైనా సాధించాలె అనుకుంటున్న సమయంలోనే పెండ్లి ముచ్చట తీసిండ్రు మావోళ్లు. ఒప్పుకోక తప్పని పరిస్థితులు. మా ఆయన పేరు రవీందర్. నాలుగు చేతులూ కష్టవడితెనే కడుపు నిండుతది. పిల్లల ఆలనా పాలన తోనే సరిపోయేది. పాటకు దూరమైనా.. మహిళా సంఘాల మీటింగ్ జరిగినప్పుడు ‘ఎవరైనా పాట పాడుండ్రీ’ అని ఆఫీసర్లు అంటే , పానం ఊకోబుద్ధిగాక మంచి మంచి పాటలు పాడేదాన్ని. ఇంట్లో తినేటప్పుడో, పనిచేసేటప్పుడో ఏదో ఒకటి పాడి బుద్ధి తీర్చుకునేదాన్ని.
కరోనాతో పనులన్నీ బందైనయి. పొద్దువోక అప్పుడప్పుడు ఫోన్లో జానపదాలు వినేదాన్ని. అన్నీ నేను చిన్నప్పుడు పాడినవే. నాకు మల్లా పాటమీద ధ్యాస ఏర్పడింది. చిన్నప్పుడు అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మల దగ్గర నేర్చుకున్న పాటలన్నీ నోటిమీదికి తెచ్చుకున్న. ‘అమ్మా.. నువ్వు చాలా మంచిగ పాడుతున్నవే. యూట్యూబ్లో పెడితే నీ పాట ఎక్కడికో వెళ్లిపోతది. మంచి పేరొస్తది. నీకెట్లా పాటలంటే ఇష్టమేగా’ అన్నది నా బిడ్డె. ‘కాయకష్టం చేసుకునేటోళ్లం. మనకెందుకు బిడ్డా ఇవన్నీ’ అని ఎంత చెప్పినా వినలేదు. ‘నువ్ పాడితీరాల్సిందే’ అని పట్టువట్టి వాళ్ల నాయినతో చెప్పి ఒప్పించింది.
పాటలు చేతిలవట్టుకొని ఎందరినో కలిసి డెమోలు ఇచ్చినం. కొందరైతే మా ట్యూన్స్ తీసుకొని వాడేసుకున్నరు. మరీ ఘోరంగా ఒకరైతే కనీసం నా పేరుకూడా పెట్టకుండా పాటను విడుదల చేసిండ్రు. మా ఆరాటాన్ని అర్థంచేసుకొని ‘నాని టీవీ’ దుర్గం స్వామి అన్న మాకొక అవకాశం ఇచ్చిండు. ‘ముక్కూ పుల్లాలువాయె మామిడికిందో నల్ల మామిడి కింద’ పాట అది. ఇగ అప్పటినుంచి నేను పాడిన 15కు పైగా పాటలు విడుదలైనయి. ఇంకా కొన్ని రికార్డింగ్ అవుతున్నయి. ‘మీ దగ్గర్నే అంత మంచి పాటలున్నయి. ఓ చానెల్ పెట్టుకుంటే బాగుంటది’ అని తెలిసినవాళ్లు సలహా ఇచ్చిండ్రు. దీంతో ‘ఎల్ఆర్ ఫోక్స్’ చానెల్ పెట్టినం. ‘మర్రిసెట్లా కిందా మాగిపొద్దీయాల్ల మర్లెనే బొంగురాలాట రామొజ్జెరామా’, ‘వానగొట్టె వానాగొట్టె నగుబాయి.. వానేడగొట్టె’, ‘అత్తాకోడండ్లు గూడి అడ్లుదంచంగ కీసులాటవెట్టుకొని కిందవడిరీ’, ‘హరిదేవీ సిరీదేవి అచ్చమల్లెలురా’, ‘తొవ్వంట వొయ్యేటి ఓ కాపయ్యా’ వంటి పాటలు పాడిన. తాజాగా ‘పుట్టసాటు పుల్లలు ఏరేటి కిట్టమ్మ రావోయి కిట్టమ్మ గోవులూ ఎటువాయెనో’ పాట పాడిన. సూపర్ హిట్టయ్యింది. మాకు మానేరు టీవీ పరశురామన్న హెల్ప్ చేస్తుంటడు. మా ఆయన సపోర్ట్తోటి, పాట పెట్టిన భిక్షవల్ల.. ఏ సదువూ సందెలేని నేను ఇక్కడిదాకా వచ్చి నిలిచి గెలిచినందుకు గర్వంగా ఉన్నది.
… దాయి శ్రీశైలం
కూలీ పని చేసుకునే నన్ను పల్లె పాట పాపులర్ చేసింది !!”
Folk Singer Kalavathi | వందలయేండ్ల గోండుల కళను బతికిస్తున్న కళావతి”
Mukunda | మంచి ఫోక్ సింగర్ కావాలన్నదే లక్ష్యం.. పెద్ద సినిమాకు పాడటం నా డ్రీమ్”
Telu Vijaya | రెండు పీజీలు చేసినా రాని గుర్తింపు ఒక్క పాటతో వచ్చింది”