Tea | వర్షాకాలం వచ్చేస్తున్నది. చల్లగా చిరుజల్లులు పడుతూ ఉంటే.. వేడివేడిగా కాఫీనో, చాయో తాగాలని మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. అప్పటికే ఉదయం – సాయంత్రం కాఫీ/టీ తాగే అలవాటు ఎలాగూ ఉంటుంది. ఈ క్రమంలో రోజుకు ఐదారు సార్లయినా ఉష్ణోదకం.. ఉదరంలోకి చేరిపోతుంది. అయితే, ఇలా అతిగా కాఫీలు, టీలు తాగడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. తగిన మోతాదులో తీసుకుంటే.. కాఫీలు, టీలతో శరీరానికి మేలే జరుగుతుంది. కానీ, మోతాదు మించితే మాత్రం.. ఆరోగ్యానికి చేటు తెస్తుంది. రోజుకు రెండుసార్లకు మించి తాగితే.. మధుమేహంతోపాటు ఊబకాయం బారినపడే ప్రమాదం కూడా ఉన్నది. టీ, కాఫీల్లో ఉండే సుక్రోజ్.. కాలేయం, కండరాలు, చిన్నపేగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటికే పలు పరిశోధనలు తేల్చాయి కూడా. ఇక రోజుకు ఐదారు కప్పులు లాగిస్తే.. ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందట.
కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, నిద్ర సమస్యలు, ఆహారం జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలూ తలెత్తుతాయట. శరీరానికి అధిక క్యాలరీలు అంది, శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం కూడా ఉన్నది. అంతేకాకుండా.. రోజువారీగా శరీరంలోకి వెళ్లే కెఫిన్ స్థాయులు 300 ఎంపీ మించి ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజన సమయంలో టీ, కాఫీలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదట. తిన్న తర్వాత టీ, కాఫీ తాగితే.. ఆహారం త్వరగా అరుగుతుందని, శరీరంలో పేరుకున్న నూనె కరిగిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ, అది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఇక పరగడుపున టీ, కాఫీలు తాగడం కూడా మంచి అలవాటు కాదు. అల్పాహారం చేసిన తర్వాతే తాగాలని సలహా ఇస్తున్నారు.