గిరిజన తండాల్లో జన జీవనం అస్తవ్యస్తం. ఆరోగ్యం, చదువు అంతంత మాత్రమే. ఇది చాలదన్నట్టు చావులు. ఒక్క జార్ఖండ్‌లోనే ఏటా వేయిమంది నవజాత శిశువుల్లో 30 మంది చనిపోతున్నారు. ఓ వైద్యురాలు తన భర్తతో కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనిపెట్టారు.
మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా కదిలారు డాక్టర్ నిర్మలా నాయర్. జార్ఖండ్‌లోని గిరిజన తండాల్లో మాతాశిశు మరణాలకు మూల కారణాన్ని గుర్తించి, తనదైన పరిష్కారం సూచించారు. భర్త డాక్టర్ ప్రశాంత్ త్రిపాఠితో కలిసి ఓ స్వచ్ఛంద సంస్థనూ స్థాపించారు. వేలాది నవజాత శిశువుల ప్రాణాలను కాపాడుతూ, పచ్చి బాలింతల బతుకులను నిలబెడుతూ రెండు దశాబ్దాలుగా జార్ఖండ్‌లో వైద్య చైతన్యాన్ని తీసుకొస్తున్నారు నిర్మల. ప్రశాంత్ త్రిపాఠి, నిర్మలా నాయర్ జార్ఖండ్‌లోని ఒక చిన్న గ్రామంలో పనిచేసేవారు. కండ్లముందే తల్లీబిడ్డల మరణాలను చూశారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి నిర్మల ఒక అధ్యయనం నిర్వహించారు. ఆ సర్వేలో ఆందోళనకరమైన విషయాలెన్నో తెలిశాయి. దీంతో నిర్మల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. భర్తతోనూ చేయించారు. ఇద్దరూ సొంతూరు చక్రధర్పూర్ వెళ్లిపోయారు. రోజంతా పరిసరాల్లోని తండా ప్రజలతో మమేకమై వారి సాదక బాధకాలు తెలుసుకోవడం ప్రారంభించారు. క్రమంగా ప్రజలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ‘ఎక్జట్’ అనే ఎన్జీవోను స్థాపించారు. కథలు, ఆటల రూపంలో, సంభాషణల ద్వారా.. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచారు. ఆ కృషిని గుర్తించిన జార్ఖండ్ ప్రభుత్వం వైద్య దంపతుల సేవలను 30 వేల గ్రామాలకు విస్తరించింది. ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ర్టాలూ ఇదే నమూనాను అనుసరించాయి. ప్రస్తుతం మొత్తం 50 వేల గ్రామాల్లో ఎక్జట్ ట్రస్ట్ ద్వారా శిశు మరణాల రేటును తగ్గించే కార్యక్రమం జరుగుతున్నది. నిర్మలమ్మను తల్లిలా, బిడ్డలా, దేవతలా గౌరవిస్తున్నారు తండాల ప్రజలు.