Mamta mohandas | ‘నేను ఇప్పుడిప్పుడే నిజంగా జీవించడం ప్రారంభించాను. ఎన్నో త్యాగాలు చేసి నాకు అండగా నిలబడిన నా కుటుంబం కోసం పనిచేయడం ప్రారంభించాను’ అంటున్నది నటి మమతా మోహన్‌దాస్. యమదొంగ, చింతకాయల రవి, హోమం, కింగ్, కేడీ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా తన అందం, అభినయంతో తెలుగింటి ఆడబిడ్డగా అలరించింది. క్యాన్సర్‌ను జయించి మళ్లీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది మమత. ఇటీవల ‘లాల్బాగ్’తో రీఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ‘రుద్రాంగి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సందర్భంగా మమతా మోహన్‌దాస్ పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..
బహ్రెయిన్‌లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఏకైక సంతానంగా పుట్టాను. నాన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. అమ్మ లెక్కల టీచర్. నా బాల్యం అక్కడే గడిచింది. నా చదువు కోసం అమ్మ ఉద్యోగం మానేసింది. ఇంట్లో ఉంటూ నాకు అన్నీ నేర్పించింది. చదువుతోపాటే సంగీతం నేర్చుకున్నా. చిన్నప్పుడు చాలా బిడియపడేదాన్ని. అందుకే బాల్య స్నేహితులను సంపాదించుకోలేకపోయా. హైస్కూల్‌కు వచ్చేసరికి నాలో కొంత మార్పు వచ్చింది. ఆటల్లో ముందుండేదాన్ని. ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని ఎవరైనా అడిగితే వంద సమాధానాలు చెప్పేదాన్ని.
ఉన్నత విద్య కోసం ఇండియాకు వచ్చా. బెంగళూరులో చదువు కొనసాగించా. ఇక సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ కోరుకోలేదు. అనుకోకుండా అవకాశం రావడం, నటించడం జరిగిపోయాయి. సినిమాల్లోకి వెళ్తానంటే అమ్మానాన్న మొదట సంకోచించారు. తర్వాత నాన్నే ధైర్యం చేసి ప్రోత్సహించారు. అయితే, అమ్మే నాకు మేనేజర్‌గా ఉండాలని షరతు పెట్టారు. మలయాళంలో వచ్చిన నా మొదటి సినిమా ‘మయూఖం’ నుంచి ఇప్పటివరకు అమ్మే నా మేనేజర్. సినిమాల్లోకి వచ్చాక నటనతో ప్రేమలోపడ్డా. తర్వాత సినిమానే నా ప్రపంచంగా మారిపోయింది. సినిమాతో విడదీయలేనంత అనుబంధం బలపడింది.
నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎంతో రుణపడి ఉంటా. మూసపాత్రలకు పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. ఇటీవల విడుదలైన లాల్బాగ్ చిత్రం ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. ఇందులో నర్స్‌గా నటించా. పాత్రకు న్యాయం చేయడానికి నేను ఎంతో పరిశోధన చేశాను. కొవిడ్ కంటే ముందే పూర్తయింది. కానీ, కరోనా కారణంగా విడుదల కావడానికి ఇన్ని రోజులు పట్టింది. మలయాళంలో నేను నటించిన మరో చిత్రం అన్‌లాక్ త్వరలోనే ఓటీటీ ( OTT )లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో విడుదలకు సిద్ధంగా ఉన్న మరో సినిమా ‘జన గణ మన’. అందులో నేను పోషించిన సబా మరియమ్ అనే డైనమిక్ క్యారెక్టర్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
సినిమాల్లోకి రాకపోయి ఉంటే బ్యాంక్ ఉద్యోగిగా సెటిలయ్యేదాన్నేమో! నాకు రేస్ ట్రాక్ డ్రైవింగ్, అడ్వెంచర్స్ అంటే ఇష్టం. ప్రతిరోజూ సాహసం చేయాలనుకునే వ్యక్తిని నేను. క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా ఇదే కారణం. క్యాలిఫోర్నియా శాంటాబార్బరా తీరంలో 18వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేశాను. మెక్సికో సముద్రం తీరంలో స్కూబా డైవింగ్, రాస్ అల్ ఖైమాలోని జిప్ లైన్ (ప్రపంచంలోనే అతి పొడవైనది)లో పారాైగ్లెడింగ్, స్నోర్కెలింగ్ వంటి సాహసాలు చేశాను.
లాక్డౌన్లో కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా ఉండే అవకాశం దొరికింది. నాకు కొత్తజీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడం చాలా బాగుంది. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. కొచ్చిన్‌లోని మా సొంతింట్లో ప్రశాంతంగా కాలక్షేపం చేశాం. అప్పుడు వ్యాయామంపై ప్రత్యేక దృష్టిపెట్టా. రోజు రెండుసార్లు జిమ్ చేసేదాన్ని. ఖాళీ సమయాల్లో అందరం కూర్చొని స్ట్రీమింగ్ కంటెంట్‌ను చూసి, పుష్కలంగా నిద్రపోయేవాళ్లం.
పార్టీలకు వెళ్లడం కంటే కుటుంబంతోనే గడపడానికి ఎక్కువ ఇష్టపడతా. లాక్‌డౌన్‌కు ముందు ఏడేండ్లు లాస్ ఏంజెల్స్‌లోని మెరీనా డెల్రేలో ఉన్నా. అది చాలా అందమైన ప్రదేశం. షూటింగ్స్ ఏమీ లేకపోతే అక్కడికి వెళ్లిపోతా. అక్కడ ఒంటరిగా, ప్రశాంతంగా గడపడం నాకు చాలా ఇష్టం. అక్కడ కూడా బోర్‌కొడితే దుబాయ్‌కి వెళ్తా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
సర్కారు వారి పాట విషయంలో ఆ రిస్క్ వద్దు అంటున్న మహేశ్‌బాబు..