సరిపడా ఉప్పు.. ఆహారానికి రుచిని అందిస్తుంది. ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. కానీ, మోతాదు పెరిగితే.. ఆహారంతోపాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ విషయమై.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొన్ని సూచనలు ఇచ్చింది. ప్రస్తుతం తీసుకుంటున్న రోజువారీ ఉప్పులో.. 2 గ్రాముల దాకా తగ్గించాలని సూచించింది. ఫలితంగా.. రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నది.
గుండెలో దడ: అధిక సోడియం.. గుండెపోటు సహా పలు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అదే.. ఉప్పును తగ్గిస్తే గుండెపై ఒత్తిడిని తగ్గించవచ్చు. సోడియం అధికంగా తీసుకోవడం వల్ల రక్త నాళాలు గట్టిపడతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
మూత్రపిండాలకు చేటు: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం.. మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. శరీరం నుంచి అదనపు సోడియాన్ని వడపోయడానికి కిడ్నీలు ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. దీంతో దీర్ఘకాలంలో మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా, మూత్రపిండాల్లో రాళ్లు, ద్రవం నిలవడం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
రక్తపోటు: ఉప్పును ఎక్కువగా తీసుకోవడం.. రక్తపోటును పెంచుతుంది. ఉప్పులో అధికంగా ఉండే సోడియం క్లోరైడ్.. శరీరంలోని నీటిని పట్టి ఉంచుతుంది. ఇది రక్త పరిమాణాన్ని పెంచి.. అధిక రక్తపోటుకు దారితీస్తుంది.