చలికాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పుల వల్ల మన రోగనిరోధక శక్తి నెమ్మదిస్తుంది. దీనివల్ల అలర్జీలు, చర్మం పొడిబారడం, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటి సమయంలోనే శరీరంలోని అవయవాలను దృఢంగా ఉంచుకోవడం అత్యంత అవసరం. అందుకోసం చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన 5 రకాల ఆహారాల గురించి తెలుసుకుందాం.
ఆవ ఆకు కూర: ఉత్తర భారతదేశంలో ‘సర్సో’గా పిలిచే ఆవాకు కూరలో పుషలమైన పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కె ఉండటమే కాకుండా పీచు పదార్థం అధిక స్థాయిలో ఉండి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. వారంలో ఐదుసార్లయినా దీన్ని భోజనంలో భాగం చేసుకుంటే మంచిది.
పచ్చి పసుపు: పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, వాపును తగ్గించే గుణాలు మెండుగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. శరీరంలో మంటను తగ్గించడానికి అద్భుతమైన ఔషధం కూడా. ప్రతిరోజు ఉదయాన్నే గ్లాస్ నీటిలో చిటికెడు పసుపును కలుపుకొని తాగండి.
ఖర్జూరం: శరీరానికి తక్షణ శక్తిని, వెచ్చదనాన్ని అందించడంలో ఖర్జూరం సాటిలేనిది. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు అలసటను దూరం చేసి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నీరసంగా ఉన్నప్పుడు వీటిని స్నాక్స్‌లా తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారు.
ఉసిరి: విటమిన్ సి నిధిగా పిలిచే ఉసిరి చలికాలంలో వచ్చే జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దాన్ని కోసిన తర్వాత కూడా అందులోని పోషకాలు త్వరగా నశించకపోవడం ఉసిరిలోని గొప్ప లక్షణం. అందుకే దీన్ని ఏ రూపంలో తీసుకున్నా పూర్తి ప్రయోజనం అందుతుంది.
నువ్వులు: చూసేందుకు చిన్నవిగా కనిపించినా నువ్వుల్లో అపారమైన ఆరోగ్య శక్తి దాగి ఉంటుంది. ఇవి శరీరంలో వేడిని పుట్టించే గుణాన్ని కలిగి ఉంటాయి. అన్ని రకాల గింజల కంటే నువ్వులలోనే క్యాల్షియం అత్యధికం ఉండటం మూలంగా ఎముకల బలానికి, కీళ్ల ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. లడ్డూలు, చికీల రూపంలో వీటిని తీసుకోవడం ఉత్తమం.