మన శరీరాలకు పోషణ మనం తినే ఆహారం నుంచే లభిస్తుంది. శరీరం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్, రిఫైన్డ్ పిండి, చక్కెరలు, ఉప్పు, రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఆహారాలు జీర్ణ సమస్యలతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలకు బాటలు వేస్తాయి. అంతేకాదు మసాలా, వేపుడు ఆహారాలు కూడా పొట్టలో అసౌకర్యం కలుగజేస్తాయి. కాబట్టి, పొట్టకు మేలు చేసే ఆహారాన్ని మన భోజనంలో భాగం చేసుకోవాలి.
యోగర్ట్: పొట్ట ఆరోగ్యానికి యోగర్ట్ మంచి ఆహారం. రోజూ యోగర్ట్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను అధిగమించవచ్చు. ఉదయం వేళలో, మధ్యాహ్నం భోజన సమయంలో యోగర్ట్ తీసుకోవడం మంచిది.
హోల్ గ్రెయిన్స్: ముతక ధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్) పొట్టకు మేలుచేసేవిగా పరిగణిస్తారు. గోధుమలు, ఓట్స్, బియ్యం, ఇతర హోల్గ్రేన్స్ నుంచి ఆహారం తీసుకోవాలి. ఇవి పొట్టకు మంచివి. వీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
అరటిపండు: బాగా మాగిన అరటిపండు పొట్టకు ఎంతో మేలుచేస్తుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. అరటిపండు తినడం వల్ల అరుగుదల మెరుగుపడుతుంది. ఎన్నో పొట్ట సమస్యలు కూడా పారిపోతాయి. అరటిపండు తినడం పొట్టకు సంబంధించిన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను తగ్గిస్తుంది.
పొప్పడిపండు: పొప్పడిపండు అరుగుదలకు సహాయకారిగా ఉంటుంది. పొట్టను శుభ్రం చేసే పోషకాలకు ఇది గని. అలా పొప్పడిపండు మలబద్ధకాన్ని నివారిస్తుంది. అరుగుదల మొదలుకుని గుండెలో మంట, అజీర్తి తదితర సమస్యలను దూరం చేస్తుంది.
అల్లం: అల్లాన్ని పొట్టకు మేలుచేసేదిగా పరిగణిస్తారు. వికారం, కడుపునొప్పితో బాధపడుతున్నవాళ్లకు అల్లం మంచిది. రోజువారీగా భోజనంలో ఏదో విధంగా అల్లాన్ని చేర్చుకోవడం మంచిది.