Sugar Apple | ఏ రుతువులో లభించే పండ్లను ఆయా రుతువుల్లో తప్పకుండా తినాలన్న విషయం తెలిసిందే. వివిధ కారణాల వల్ల చాలామంది ఈ సూత్రాన్ని అంతగా పాటించరు. ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో సమృద్ధిగా లభించే పండు సీతాఫలం. ఆకుపచ్చగా, తియ్యగా ఉండే ఈ అమృత ఫలం శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
సీతాఫలంలో క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు దోహదపడతాయి. ఇందులో విటమిన్ బి-6 కూడా ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, బీపీ ఉన్నవాళ్లు కూడా సీతాఫలాన్ని మొహమాటం లేకుండా తినొచ్చు. దీనిలో ఎక్కువగా ఉండే పీచు పదార్థం మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
సీతాఫలం మూడ్ను, రోగ నిరోధకతను పెంపొందిస్తుంది. వాతాన్ని నివారిస్తుంది. కండ్లు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.అజీర్తిని అరికడుతుంది. అల్సర్లు, ఎసిడిటీని నివారిస్తుంది. చర్మానికి నునుపుదనాన్ని ఇస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతుంది. ఊబకాయం, క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
పండ్లను భోజనం తర్వాత కానీ, భోజనంతోపాటు కానీ తినకూడదని పోషకాహార నిపుణుల సూచన. ఉదయం 11, సాయంత్రం 4 గంటల సమయంలో తినాలట. ఒకసారి ఒక రకం పండును తింటే మంచిది. రసం తీయడం కంటే పండుగా తింటేనే ఎక్కువ ప్రయోజనం. సీతాఫలాన్ని పండుగానే కాకుండా బాసుంది, ఖీర్, ఐస్క్రీం, హల్వా, కేకుల్లో కూడా వాడుకోవచ్చు.