శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Aug 01, 2020 , 23:59:55

మీ ప్రయాణం.. ధ్వని కన్నా వేగం!

మీ ప్రయాణం.. ధ్వని కన్నా వేగం!

  • అభివృద్దిలో సూపర్‌సోనిక్‌ ప్యాసింజర్‌ విమానాలు
  • ఇప్పటికే డిజైన్‌ పూర్తి.. త్వరలోనే గాలిలోకి
  • లండన్‌ టూ న్యూయార్క్‌ మూడున్నర గంటలే 
  • తయారీ దశలోనే విమానాల కొనుగోలుకు ఆర్డర్లు

హైదరాబాద్‌లో విమానం ఎక్కితే సీట్లో కుదురుగా కూర్చునే లోపే ఢిల్లీలో ల్యాండయితే..! లండన్‌ నుంచి కేవలం మూడున్నర గంటల్లోనే న్యూయార్క్‌ చేరుకోగలిగితే.. ! ఊహకు ఏమున్నది.. ఎక్కడికైనా పోవచ్చు.. అనుకుంటున్నారు కదా.. కానీ త్వరలోనే ఇలాంటి విమాన ప్రయాణం సాకారం కాబోతున్నది. 12 గంటల్లోనే మొత్తం భూగోళాన్ని చుట్టిరాగల విమానం తయారవుతున్నది. ఇప్పటివరకు యుద్ధవిమానాలకు మాత్రమే సాధ్యమైన సూపర్‌సోనిక్‌ స్పీడ్‌.. త్వరలో ప్యాసింజర్‌ విమానం కూడా అందుకోబోతున్నది. అదే ఓవర్చర్‌..

ఓవర్చర్‌ సూపర్‌ సోనిక్‌ విమానాన్ని రోల్స్‌రాయిస్‌, బూమ్‌ సూపర్‌సోనిక్‌ కంపెనీలు సంయుక్తంగా తయారుచేస్తున్నాయి. విమానం డిజైన్‌ ఇప్పటికే తయారైంది. త్వరలోనే ప్రయాణానికి సంబంధించిన ప్రయోగాలు ప్రారంభం కానున్నాయి. విమానయానం రంగం స్వరూపాన్నే మార్చివేయగల ఈ విమానం తయారీకోసం రెండు సంస్థలు కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నాయని బూమ్‌ సంస్థ సీఈవో బ్లేక్‌ షూల్‌ తెలిపారు. 

దిగిరానున్న ధరలు


ఈ సూపర్‌ సోనిక్‌ విమానాలు అందుబాటులోకి వస్తే విమాన ప్రయాణం భారం తగ్గుతుందని కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు. లండన్‌నుంచి న్యూయార్క్‌ వెళ్లాలంటే ఇప్పుడున్న విమానాల్లో దాదాపు 8 గంటల సమయం పడుతుంది. కానీ సూపర్‌సోనిక్‌ విమానాల్లో 3.5 గంటల్లోనే వెళ్లిపోవచ్చు. సమయం కలిసివస్తుంది కాబట్టి విమానాలు ఎక్కవ ట్రిప్పులు తిరుగుతాయి. లండన్‌ నుంచి న్యూయార్క్‌కు ఒకసారి ఈ విమానంలో ప్రయాణించాలంటే దాదాపు రూ.లక్షా 70 వేలు అవుతుంది. రాను రాను ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. ప్రపంచంలోని వివిధ నగరాల మధ్య 2000 ఓవర్చర్‌ సూపర్‌సోనిక్‌ విమానాలను చక్కర్లు కొట్టించాలని తయారీదారులు ప్రణాళిక వేస్తున్నారు.

విమానం విశేషాలు

  • తయారీ సంస్థ రోల్స్‌రాయిస్‌, బూమ్‌ సూపర్‌ సోనిక్‌
  • 8,336 గంటకు కిలోమీటర్ల వేగం
  • 3ఇంజిన్లు  
  • 92- 128 మోసుకెళ్లే ప్రయాణికులు

ఎకో ఫ్రెండ్లీ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత అభివృద్ధి మొత్తం పర్యావరణహితం అన్న అంశం చుట్టూనే తిరుగుతున్నది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే ఓవర్చర్‌ విమానాన్ని కూడా తయారు చేస్తున్నారు . సాధారణ విమానాల కంటే ఓవర్చర్‌ 2.5శాతం తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. తక్కువ శబ్దం చేస్తుంది. దాంతో శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. విమానయాన రంగంలో సూపర్‌సోనిక్‌ ప్రయోజనాలను స్థిరంగా ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతోనే తాము బూమ్‌ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టామని రోల్స్‌రాయిస్‌ స్ట్రాటజీ విభాగం డైరెక్టర్‌ కార్లెస్లీ తెలిపారు. 

మొదలైన ఆర్డర్లు

ఈ సూపర్‌సోనిక్‌ విమానాలు ప్రయోగాల దశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే వాటికి ఆర్డర్లు మొదలవటం విశేషం. వర్జీనియా ఎయిర్‌లైన్స్‌, జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఈ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. మరికొన్ని సంస్థలు చర్చలు మొదలుపెట్టాయి. బూమ్‌ సూపర్‌సోనిక్‌ సంస్థ ఇప్పటికే సొంతంగా ఎక్స్‌బీ-1 అనే సూపర్‌సోనిక్‌ ప్రొటోటైప్‌ విమానానికి తుదిరూపు ఇస్తున్నది. ఇది ఓవర్చర్‌కంటే వేగంగా ప్రయాణించగలదని కంపెనీ చెప్తున్నది. వచ్చే అక్టోబర్‌ 7న దీనిని ప్రపంచానికి పరిచయం చేయటానికి బూమ్‌ సిద్ధమవుతున్నది. 


logo