చేవెళ్లటౌన్, ఏప్రిల్ 20 : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం చేవెళ్ల మండలం కుమ్మెర గ్రామ గేట్ సమీపంలోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ఎన్నికల ప్రచార వాహనాలకు ఆయన పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం రావులపల్లిలో ఇంటింటి ప్రచారం చేయడంతోపాటు చేవెళ్ల మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ కాసాని గెలుపును కానుకగా ఇద్దామన్నారు.
పేదల కష్టాలు తీర్చి గొప్ప నాయకుడని, సీఎంగా ఇవ్వని హమీలను సైతం నెరవేర్చారన్నారు. ఏడాదికి రూ.10వేలు రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను అన్నదాతలకు అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తన తరఫున 21 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్‌ను అర్హులకు ఇప్పించినట్లు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సీఎం రిలీఫ్‌ఫండ్ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.
అధికారంలోకి రాగనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదన్నారు. కనీసం సరిపడా సాగు, తాగు నీరు ఇద్దామన్న సోయి కూడా రేవంత్ సర్కార్ లేదన్నారు. రూ.24 కోట్లతో ముడిమ్యాల నుంచి రావుపల్లి, మేడిపల్లి వరకు, రూ.34 కోట్లతో పొద్దటూర్ గేట్ నుంచి ఎల్వర్తి గేట్ వరకు రోడ్డు మంజూరు చేయించామని, ఏదేమైనా పనులను పూర్తి చేసి తీరుతామన్నారు. అమలుగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే చేవెళ్ల ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించుకోలన్నారు.
ఎమ్మెల్సీగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయనకు ఎంతో అనుభవమున్నదని, అత్యధిక మెజారిటీ అదించి ప్రగతిని స్వాగతించాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జి రాంబాబు యాదవ్, సీనియార్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల మండల సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివారెడ్డి, రావులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, బుచ్చయ్య, హన్మంత్‌రెడ్డి, సుశీల బాల్‌రాజ్, మాజీ ఎంపీటీసీ కిష్టయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రాములు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గరిధర్రెడ్డి, మాజీ డైరెక్టర్లు వెంకటేశ్, మహేశ్, గని, వార్డు సభ్యులు కుమ్మరి వరలక్ష్మి విఠలయ్య, నాయకులు దండు సత్తి, చందు, ఎల్లయ్య, చింటు, శ్రీకాంత్, రాము ప్రసాద్, మహేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.