e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు ధైర్య‌మే ఆయుధం.. సేవే సంక‌ల్పం

ధైర్య‌మే ఆయుధం.. సేవే సంక‌ల్పం

ధైర్య‌మే ఆయుధం.. సేవే సంక‌ల్పం

అప్రమత్తత.. జాగ్రత్తలతో కరోనాకు చెక్‌
ఇంట్లోనే ఉండి వైరస్‌ను జయించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌
తిరిగి విధుల్లో చేరి ఎప్పటిలాగే బాధ్యతల నిర్వహణ

కరోనా పడగనీడలో ఉన్నామని తెలిసినా ప్రజా సేవకు వారు వెనుకాడలేదు. తమ కుటుంబ సభ్యులకు కరోనా వచ్చే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ భయపడ లేదు. చివరకు కరోనా బారిన పడినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక.. స్వీయ నిర్బంధంలోనే ఉంటూ వైరస్‌ను జయించారు. తిరిగి విధుల్లో చేరి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటాన్ని సాగిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కరోనా మహమ్మారిపై మానవాళి చేస్తున్న యుద్ధంలో భాగంగా జిల్లాలో వైద్యులు, వైద్య సిబ్బంది ఆది నుంచీ.. ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. పోలీసులు, అంగన్‌వాడీ వర్కర్లు, పారిశుధ్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ క్రమంలో చాలామంది వైరస్‌ బారిన పడగా.. మొక్కవోని ధైర్యంతో కరోనాను జయించారు. కోలుకున్న అనంతరం తిరిగి విధుల్లో చేరి తమ సేవలను కొనసాగిస్తున్నారు. కరోనా వచ్చిందని భయపడ కూడదని.. ఇంట్లోనే సరైన జాగ్రత్తలు తీసు కుంటే కరోనా నుంచి బయటపడ వచ్చని వారు చెబుతున్నారు.

ఇదొక యుద్దం. కనిపించని శత్రువుతో ఆయుధాలు లేకుండా చేయాల్సిన పోరాటం. సమస్త మానవాళిని కాపాడటానికి జరుగుతున్న ఈ యుద్ధంలో తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్న యోధులు ఎందరో. ఇందులో అందరికంటే ముందు వరుసలో ఉంటారు వైద్యులు. వీరే కాదు.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లదీ ఇదే సాహసం. మరో పక్క కరోనా కట్టడికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు పోలీసులు. అంగన్‌వాడీ వర్కర్లు, పారిశుధ్య సిబ్బంది పోషిస్తున్న పాత్ర సైతం అమోఘం. ఈ క్రమంలో జిల్లాలో విధి నిర్వహణలో ఎంతో మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కరోనా బారినపడ్డారు. మొక్కవోని ధైర్యంతో చాలా మంది కోలుకున్నారు. కొవిడ్‌ను జయించి..మళ్లీ విధులకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారితో ‘నమస్తే తెలంగాణ’ ముచ్చటించింది. కరోనా నుంచి ఎలా కోలుకున్నారో? ఏమేం తిన్నారో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో.. వారు వివరించారు. విధి నిర్వహణలోని అనుభవాలు వారి మాటల్లోనే..

  • యాదాద్రి భువనగిరి, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

కుటుంబమంతా కరోనాను జయించాం..
యాదగిరిగుట్ట రూరల్‌, మే 22 : మనోధైర్యం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అనే సామేతను స్ఫూర్తిగా తీసుకొని మా కుటుంబం మొత్తం కరోనాను జయించాం. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి మేము మా కుటుంబంలో నాతోపాటు నా భార్య, కొడుకు కరోనా బారినపడ్డాం. నా కొడుకు రాజేశ్‌కు రుచి తెలియకపోవడంతో అనుమానంతో ఏప్రిల్‌ 20న టెస్ట్‌ చేయించుకున్నాడు. పాజిటివ్‌ అని తేలిసింది. నేను, నా భార్య పద్మ కూడా టెస్ట్‌ చేయించుకోగా, పాజిటివ్‌ వచ్చింది. అందరం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాం. ప్రభుత్వం నుంచి మందులు వేసుకున్నాం. ప్రతిరోజు గోరు వెచ్చని నీరు, ఆవిరి పట్టడం, ఉడకబెట్టిన గుడ్లతోపాటు పూర్తిగా పౌష్టికాహారం తీసుకున్నాం. నా కొడుకు మాకు ధైర్యం చెబుతుండేవాడు. ఇలా పద్నాలుగు రోజుల తరువాత అందరం టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. పూర్తిగా ధైర్యంతో ఉంటే జయించడం చాలా సులభం.
– దొంతి వెంకటేశ్‌ కుటుంబం, మాసాయిపేట, యాదగిరిగుట్ట

కరోనా బారిన పడ్డాను..
ఆలేరు టౌన్‌, మే 22 : విధుల్లో భాగంగా గత 3 నెలల కింద కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. చికిత్స తీసుకొని తగ్గిన తరువాత మళ్లీ విధులకు హాజరవుతున్నాను. కరోనా విజృంభనతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. విధి నిర్వహణలో భాగంగా అన్ని రకాల రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాను. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లాలంటే కాస్త భయంగా ఉంటుంది. దవాఖానలో ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇంటి వద్ద కూడా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నాను. రోగులకు కరోనా నిబంధనలు వివరిస్తున్నాను. రోగులకు సేవలు అందించడం తృప్తిగా ఉన్నది. అది మా బాధ్యతగా భావిస్తాం.
– డా. దుర్గ, జనరల్‌ ఫిజీషియన్‌, సీహెచ్‌సీ, ఆలేరు

గుండె నిబ్బరంతో విధుల్లోకి..
ఆలేరు టౌన్‌, మే 22 : ఆలేరు సీహెచ్‌సీలో చాలా ఏండ్లుగా స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్నాను. రెండున్నర నెలల కిందట కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆ సమయంలో కుటుంబసభ్యుల సహకారంతో కొవిడ్‌ను జయించాను. ఆరోగ్యం కుదుటపడిన తరువాత విధుల్లోకి చేరాను. గుండె నిబ్బరం చేసుకొని రోజు విధులు నిర్వహిస్తున్నాను. కరోనా వచ్చినప్పుడు ముందుగా అనవసర భయాందోళనలు వీడాలి. వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. ఇంటికి వెళ్లాలంటే ఒక్కోసారి భయం వేస్తుంది. అయినప్పటికీ ఆత్మైస్థెర్యంతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. రోగులకు సేవ చేస్తుంటే అన్ని మర్చిపోతాం. – ట్రెసాసెలీన్‌, స్టాఫ్‌నర్స్‌, సీహెచ్‌సీ, ఆలేరు

ధైర్యమే కరోనాను జయించేలా చేస్తుంది..
మోటకొండూర్‌, మే 22 : కరోనా వచ్చిందని భయపడకుండా ధైర్యంగా ఉండాలి. నేను స్థానిక పీహెచ్‌సీలో వైద్య సేవలు అందించడంతోనే కరోనా బారిన పడ్డాను. అయినా భయపడకుండా హోం ఐసొలేషన్‌లో 15రోజుల పాటు ఉన్నా. ప్రభుత్వం అందించిన మెడిసిన్‌ను మాత్రమే ఉపయోగించా. కరోనా సోకిందని భయపడటంతోనే ప్రాణహాని సంభవిస్తుంది. భయం వీడి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే కరోనాను జయించవచ్చు.
– రాజేందర్‌నాయక్‌, మండల వైద్యాధికారి, మోటకొండూర్‌

రెండుసార్లు కరోనాను జయించి..
తుర్కపల్లి,మే 22 : విధి నిర్వహణలో భాగంగా తనకు రెండుసార్లు కరోనా పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతూ.. కోలుకున్న అనంతరం మళ్లీ విధులకు హాజరయ్యాను. దవాఖానలో ప్రసవాలు చేయడంతోపాటు కరోనా నేపథ్యంలో వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న కరోనా టెస్ట్‌ క్యాంప్‌లో పాల్గొంటున్నాను. కరోనా టెస్ట్‌లు వ్యాక్సిన్‌ ఆన్‌లైన్లు ప్రక్రియలో పాల్గొంటూ కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ సేవలందిస్తున్నాను. ఆపత్కాల సమయంలో రోగులకు సేవలందించడం ఎంతో సంతృప్తినిస్తుంది. – పద్మావతి, ఏఎన్‌ఎం, తుర్కపల్లి

మానసిక ధైర్యంతోనే కరోనాను జయించా
వలిగొండ, మే 22 : మానసిక ధైర్యంతోనే కరోనాను జయించాను. నాకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే భయపడకుండా, ఆశ కార్యకర్తగా పది మందికి వైద్య సలహాలు, సేవలు అందించే స్థాయిలో ఉండి కరోనా విషయంలో అధైర్య పడొద్దని వర్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఇచ్చిన మందులు, ఆరోగ్య సలహాతో, తేలికగా జీర్ణమయ్యే బలమైన ఆహారం తీసుకున్నాను. డ్రైఫ్రూట్స్‌తోపాటు వేడి పాలల్లో పసుపు వేసుకొని ప్రతిరోజు రెండు పూటల తాగిన, రెండురోజులకు ఒకసారి కరోనా కషాయం తాగుతూ సమయానుకూలంగా మందులు వేసుకుంటూ 14రోజులు హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నాను.
– కుసంగి సవిత, ఆశ కార్యకర్త, మాందాపురం, వలిగొండ

విధి నిర్వహణలో కరోనా పాజిటివ్‌ వచ్చింది..
ఆత్మకూరు(ఎం), మే 22 : గ్రామాలకు వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై అవగాహన కల్పిస్తూ అనేక మందిని కలువడంతో ఏప్రిల్‌ 22న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా 17 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉన్నాను. టాబ్లెట్లతో పాటు మంచి పౌష్టికాహారం, పండ్లు తీసుకోవడంతోపాటు కరోనా నిబంధనలు పాటించాను. మళ్లీ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ రావడంతో ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాను. – సాంబులమ్మ, ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్‌, ఆత్మకూరు(ఎం)

మనో ధైర్యమే గొప్పది
బొమ్మలరామారం, మే 22 : నాకు కరోనా వచ్చినప్పుడు అధైర్య పడకుండా ఇంటికే పరిమితమయ్యాను. ప్రభుత్వం అందించిన మాత్రలు వాడాను. మా వైద్య సిబ్బంది నాకు ఏమి కాదనే మానసిక ధైర్యాన్ని అందించారు. పూర్తి మానసిక ప్రశాంతతతో వారం రోజుల్లోనే కరోనా నుంచి విముక్తి పొందాను. కరోనా వచ్చిన వారు వదంతులు నమ్మవద్దు. ప్రభుత్వ వైద్య సిబ్బంది సూచనలు పాటించి త్వరగా భయటపడవచ్చు. మనో ధైర్యమే గొప్పది.

  • బొప్పని మాధవి, స్టాఫ్‌ నర్సు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బొమ్మలరామారం

మనోధైర్యంతో ఉంటే భయంలేదు
మోత్కూరు, మే 22 : వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న నేను నిత్యం ప్రజలతో మమేకమై ఉన్నాను. ఆరోగ్యం బాగలేక పోవడంతో అనుమానంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రెండు వారాలపాటు మందులు వాడుకుంటూ హోంక్వారంటైన్‌లో ఉన్నాను. అధైర్య పడలేదు. ఆత్మైస్థెర్యంతో ఉండి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకున్నాను. పది రోజుల తర్వాత తిరిగి పరీక్ష చేసుకోవడంతో నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. వచ్చినా భయ పడకుండా ఉండి తగిన మందులు వాడాలి. – షేక్‌ కముర్నిసా బేగం, ఏఎన్‌ఎం, మోత్కూరు

కరోనాతో భయాందోళన చెందవద్దు
భువనగిరి అర్బన్‌, మే 22 : కరోనాతో ఎలాంటి భయాందోళన చెందవద్దు. కరోనా అందరికీ వ్యాప్తిస్తున్న క్రమంలో గత సంవత్సరం లాక్‌డౌన్‌ చేయడంతో రోడ్ల మీద, బస్టాండ్లలో ఉండే యాచకులు, ప్రయాణికులు, దూర ప్రాంతాలకు వెళ్లే పాదచారులకు ప్రతిరోజు అన్నదానం చేసేది. ఈ క్రమంలో ఎలాగో నాకు వ్యాప్తింది. అనుమానం వచ్చిన వెంటనే వైద్య పరీక్ష చేయించుకున్న. వైద్యులు ఇచ్చిన సూచన, సలహాలతో టాబ్లెట్‌ వేసుకున్న. డాక్టర్‌ సలహాలు పాటించేది. చెప్పిన ప్రకారం పౌష్టికాహారం, పాలు, టాబ్లెట్స్‌ వేసుకునేది. కానీ ధైర్యంగా ఉంటూ మూడు పూటల ఫుల్‌గా భోజనం చేసేది. 20 రోజులు ఇంట్లోనే ఉన్నాను. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో రోడ్లమీద, బస్టాండ్లలో ఉండే యాచకులకు మరల భోజనం అందజేస్తున్నాం. – చెన్న మహేశ్‌, భువనగిరి

కరోనా కష్టకాలంలో అండగా నిలవాలనుకున్న
చౌటుప్పల్‌, మే 22 : నేను చౌటుప్పల్‌ ప్రభుత్వ దవాఖానలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. అయినా కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని డ్యూటీ చేశా. ప్రజలకు పెద్దఎత్తున కరోనా టెస్టులు చేశాం. ఈ క్రమంలో నాకు కరోనా సోకింది. అయినా ధైర్యం కోల్పోకుండా ఇంట్లోనే ఉండి కరోనాను జయించాను. ఇకపై కూడా కరోనా రోగులకు నా సేవలందిస్తా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు అందరం అండగా ఉండాలి. – సునీత, ల్యాబ్‌టెక్నీషియన్‌, చౌటుప్పల్‌ ప్రభుత్వ దవాఖాన

మనోధైర్యమే ముఖ్యం
యాదగిరిగుట్ట రూరల్‌, మే 22 : నాకు విధి నిర్వహణలో కరోనా సోకింది. కానీ కరోనా వచ్చిందని ఎలాంటి ఆందోళన చెందలేదు. వెంటనే ఇంట్లోనే క్వారంటైన్‌ అయ్యాను. మనోధైర్యంతో ఉన్నాను. కరోనాకు సంబంధించి ఎలాంటి వార్తలను చూడలేదు. వాటిని పూర్తిగా పక్కకు పెట్టేశాను. అసలు కరోనా సోకిన విషయాన్ని కూడా మరిచిపోయి డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పనులను ఇంట్లో నుంచే చూసుకున్నాను. హోం క్వారంటైన్‌లో ప్రధానంగా పౌష్టికాహారం, ఉడకబెట్టిన గుడ్లు, డ్రై ఫ్రూట్స్‌, చికెన్‌ వంటి వాటిని తీసుకున్నాను. కొవిడ్‌కు సంబంధించిన మందులను వేసుకున్నాను. ప్రతిరోజు వ్యాయామం చేశాను. తరుచూ వేడి నీటితో ఆవిరి పడుతూ, గోరు వెచ్చని నీటిని తాగాను. పూర్తి ధైర్యంతో ఉన్నాను. దీంతో 14రోజుల తరువాత టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌ వచ్చింది. ఎలాంటి టెన్షన్‌కు గురికాకుండా ఉంటే కరోనాను జయించడం చాలా సులభం. తిరిగి నా విధులను గతంలాగే నిర్వహిస్తున్నాను. – కోట్ల నర్సింహారెడ్డి, ఏసీపీ, యాదాద్రి

జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బంది ఉండదు
చౌటుప్పల్‌ రూరల్‌, మే 22 : కరోనాకు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో నాకు కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు చేసుకుంటే పాజిటివ్‌ వచ్చింది. డాక్టర్‌ సలహాతో ప్రభుత్వ దవాఖాన మందులు వాడుతూ హోంక్వారంటైన్‌లో ఉన్నాను. ప్రతినిత్యం బలమైన ఆహారం, డ్రైఫ్రూట్స్‌ తీసుకున్నాను. అంతేకాకుండా సరైనా వ్యాయామం చేయడంతో పూర్తిగా తగ్గింది. ఎలాంటి ఇబ్బంది కాలేదు. కరోనాకు మనోధైర్యమే సరైన మందు. భయపడాల్సిన అవరసరం లేదు.
– ఎన్‌.నవీన్‌బాబు, ఎస్‌ఐ, చౌటుప్పల్‌

మనోధైర్యంతో కరోనా జయించాను
రామన్నపేట, మే 22 : జ్వరం, గొంతునొప్పి, జలుబు, వాసన లేక పోవడంతో ఏప్రిల్‌ 25న రామన్నపేట దవాఖానలో కరోనా టెస్ట్‌ చేయించుకోగా, పాజిటివ్‌ వచ్చింది. వెంటనే హోం ఐసొలేషన్‌ తీసుకున్నాను. పాజిటివ్‌ రిపోర్టు రాగానే మొదటి రోజు భయం వేసింది. రెండోరోజు నుంచి మనోధైర్యంతో డాక్టర్ల సలహాల మేరకు మందులు వాడుతూ పోషక పదార్థాలు గల పండ్లు, డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకున్నాను. రోజు రెండు పూటల ఆవిరిపట్టాను. కరోనా ఆలోచనను వీడేందుకు రోజు పల్లె ప్రగతి, గ్రామాల్లోని ఇతర అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు, కార్యదర్శులతో ఫోన్‌లో మాట్లాడి, సలహాలు, సూచనలు ఇచ్చాను. కరోనా ఉందనే ఆలోచనను మానేసి మనోధైర్యంతోనే కరోనాను జయించాను. ఈనెల 7వ తేదీన కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. ప్రస్తుతం చురుకుగా విధులు నిర్వహిస్తున్నాను.
– జలేందర్‌రెడ్డి, ఎంపీడీవో, రామన్నపేట

కరోనా వస్తే భయాందోళనకు గురికావొద్దు..
యాదాద్రి, మే 22 : రోజు కరోనా రోగులకు పరీక్షలు, వ్యాక్సిన్‌ పంపిణీలో పాల్గొన్నాను. ఈ క్రమంలో గత 15 రోజుల కిందట స్వల్ప లక్షణాలు కనిపించడంతో వెంటనే మా వైద్యాధికారి సూచనల మేరకు పరీక్షలు చేయించుకున్నాను. కరోనా పాజిటివ్‌ రావడంతో వెంటనే హోం ఐసొలేషన్‌కు వెళ్లాను. ప్రభుత్వం అందజేసే కొవిడ్‌ మందులను, పౌష్టికాహారం తీసుకున్నాను. రోజు వేడి నీటితో ఆవిరి పట్టాను. ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గా ఉన్నది. కరోనా సొకితే భయాందోళనకు గురికావొద్దు. ధైర్యంగా ఉండి కరోనాను ఎదుర్కోవాలి. భయపడితే అంతే. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి.
– ఎన్‌.ప్రవీణ్‌, ఆరోగ్య విస్తరణాధికారి, పీహెచ్‌సీ మోటకొండూర్‌

డాక్టర్‌ సలహాతోనే మామూలు స్థితికి చేరా
భువనగిరి అర్బన్‌, 22 : కరోనా లక్షణాలు కనిపించగానే డాక్టర్‌ సలహాతో వైద్య పరీక్ష చేయించుకున్న. ఎలాంటి భయాందోళన చెందకుండా కరోనా ఏ స్టేజీలో ఉందో చెకప్‌ చేయించుకొని డాక్టర్‌ సలహాతో తెలుసుకున్నా. మొదటి స్టేజీలో ఉందని, ఏం భయపడవద్దు, ఇంట్లోనే ఉండి టైం ప్రకారం టాబ్లెట్లు, ఫౌష్టికాహారం తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. దీంతో డాక్టర్‌ సూచనలతో ఇంట్లోనే ఉండి ప్రతి రోజు డాక్టర్‌ను ఫోన్‌లో సంప్రదిస్తూ చెప్పిన సమయం ప్రకారం చేసేది. మొదట భయమేసింది. కానీ రోజు డాక్టర్‌ చెప్పిన సలహాలతో భయం కన్పించలేదు. ఇలా చేస్తూ కరోనాను జయించాను. కరోనా వచ్చిన వారు ఎలాంటి భయాందోళన చెందవద్దు. లక్షణాలున్నా కరోనా పరీక్షలు చేయించుకుని ధైర్యంగా ఉండాలి. కరోనాకు ముఖ్యంగా మందే ధైర్యం.
– గాదె శ్రీనివాస్‌, అయ్యప్పస్వామి దేవాలయ ఉపాధ్యక్షుడు, భువనగిరి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధైర్య‌మే ఆయుధం.. సేవే సంక‌ల్పం

ట్రెండింగ్‌

Advertisement