e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home యాదాద్రి అలుపెరుగని ఆశయం

అలుపెరుగని ఆశయం

అలుపెరుగని ఆశయం
  • కొవిడ్‌ కట్టడిలో కీలకంగా ఆశ వర్కర్లు
  • ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరణ
  • మందులు అందజేత
  • జిల్లాలో 21 పీహెచ్‌సీల్లో 705 మంది ఆశ వర్కర్లు

యాదాద్రి, మే20 : అనుక్షణం అప్రమత్తం.. కొవిడ్‌ వైరస్‌ కట్ట డే వారి లక్ష్యం. ఇంటింటికీ తిరిగి అనుమానితులను గుర్తించి, వైద్య పరీక్షలు చేయించి, వారికి అవగాహన కల్పించడంలో ఆశ వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. కొవిడ్‌ రెండో దశ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములుగా నిలిచి పలువురితో శభాష్‌ అనిపించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి ప్రజల ప్రాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ క్రమంలో వైద్య సిబ్బందిలో భాగమైన ఆశ వర్కర్ల సేవలు వెలకట్టలేనివి. క్షేత్రస్థాయిలో కొవిడ్‌ చైన్‌ను తెంపేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. జిల్లాలో ఐదు రోజుల పాటు జరిగిన ఫీవర్‌ సర్వేలోనూ వారు పాల్గొని ఆదిలోనే కొవిడ్‌ కట్టడికి చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 705 మంది ఆశ వర్కర్లు తమ కుటుంబ సభ్యులకు దూరమై కొవిడ్‌ కట్టడికి నడుం బిగించారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులకు మనోధైర్యాన్ని నింపి వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.

జ్వర సర్వేలోనూ వారే..
కొవిడ్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే జిల్లాలో ఐదు రోజులపాటు సాగింది. ఇందులో ఆశ వర్కర్లు పాల్గొని ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంలతో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యులకు వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే అక్కడిక్కడే మెడికల్‌ కిట్లను అందజేశారు. జ్వరం వస్తే ఏం చేయాలి, ఎలాంటి మందులు వాడాలి అని అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను చూసి భయపడాల్సిన పనిలేదని ప్రజలకు వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్‌తోపాటు వెంటిలేటర్‌, ఐసీయూ.. ఇలా అన్ని వసతులు ఉన్నాయని ప్రజలకు వివరించి వారిలో మనోధైర్యాన్ని నింపా రు. జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 705 మంది ఆశ వర్కర్లు, ఐదురోజులుగా ఇంటింటికీ తిరిగి 2,06,290 కుటుంబాలను కలిసి ఆరోగ్య వివరాలను సేకరించారు. కొవిడ్‌ లక్షణాలు కలిగిన 6,626 మందిని గుర్తించి, హోం క్వారంటైన్‌ లో ఉండాలని సూచించి తగు జాగ్రత్తలు వివరించారు. 4,633 మందుల కిట్లను పంపిణీ చేశారు. వారు చేసిన సేవతో జిల్లాలో ని 7,96,000 మంది ప్రజలకు భరోసా కల్పించినట్లయ్యింది.

పెరిగిన రికవరీ రేటు..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోపాటు స్థానిక వైద్య సిబ్బంది, ఆశ వర్కర్ల పర్యవేక్షణలో కొవిడ్‌తో బాధపడుతున్న వారిలో కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. కొవిడ్‌ పాజిటివ్‌ రాగానే ఆశ వర్కర్లు బాధితుల ఇండ్లకు వెళ్లి, మెడికల్‌ కిట్లను అందజేసి, భయపడవద్దని వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. రెండు వారాలపాటు ప్రతిరోజూ ఉదయం బాధితుల ఇండ్లకు వెళ్లి, జ్వరం, ఆక్సిజన్‌ లెవల్స్‌ను పరీక్షిస్తున్నారు. తీవ్ర అస్వస్థత కు గురైతే వెంటనే వైద్యులకు సమాచారం చేరవేసి, మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రం, హైదరాబాద్‌ ప్రభుత్వ దవాఖానలకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు, సూచనలను కొవిడ్‌ బాధితులకు అందించి వారిలో మనోధైర్యా న్ని నింపుతున్నారు. జిల్లాలో వచ్చిన కొవిడ్‌ బాధితుల సంఖ్య పరిశీలిస్తే హోం ఐసొలేషన్‌లో ఉంటూ రికవరీ అయిన రోగుల సంఖ్యే ఎక్కువగా ఉంది.

కుటుంబానికి అండగా నిలిచాం
మార్చి నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యాదాద్రి ఆలయ అర్చకుడికి లక్షణాలు కనిపిం చడంతో పరీక్షలు చేయగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. 55 ఏళ్ల అర్చకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఆయన స్వగృహంలో హోం ఐసొలేషన్‌లో ఉంచాం. అతడికి కొవిడ్‌ కిట్‌ను అందజేశాం. మరుసటి రోజు అర్చకుడి సతీమణితోపాటు కుమారుడికి కొవిడ్‌ వచ్చిం ది. వారందరినీ వేర్వేరుగా హోం ఐసొలేషన్‌లో ఉంచి, ప్రతిరోజూ వెళ్లి ఆక్సిజన్‌ లెవల్స్‌ పరీక్షించాం. 14 రోజులపాటు వారికి అండగా నిలిచాం. వారి బం ధువులు, కుటుంబసభ్యులు సైతం భయంతో సహాయం చేసేందుకు ముం దుకు రాలేదు. ప్రస్తుతం వారు కోలుకోని ఆరోగ్యంగా ఉన్నారు.
-ముఖ్యర్ల వెంకటమ్మ, ఆశ వర్కర్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాదగిరిగుట్ట

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అలుపెరుగని ఆశయం

ట్రెండింగ్‌

Advertisement