e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు ఇక సాగర్‌ అభివృద్ధిపైనే దృష్టి

ఇక సాగర్‌ అభివృద్ధిపైనే దృష్టి

ఇక సాగర్‌ అభివృద్ధిపైనే దృష్టి

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి
అందరికీ అందుబాటులో ఉంటా
గెలుపులో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
‘నమస్తే తెలంగాణ’తో సాగర్‌ విజేత నోముల భగత్

నల్లగొండ ప్రతినిధి, మే 2 (నమస్తే తెలంగాణ) : ‘సాగర్‌ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని మరోసారి ఈ విజయం ద్వారా రుజువైంది. అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు వందశాతం ప్రయత్నం చేస్తా. సాగర్‌ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంపైనే దృష్టిపెడతా. సీఎం కేసీఆర్‌, యువనేత కేటీఆర్‌ అండదండలతో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో పనిచేస్తా’ అని నాగార్జున సాగర్‌ విజేత, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ అన్నారు. సాగర్‌లో విజయానంతరం భగత్‌ నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు.
l నాగార్జునసాగర్‌లో అభివృద్ధిని కోరుకుంటూ ప్రజలు 2018లోనే ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి మా నాన్న నర్సింహయ్యను గెలిపించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధి సాధ్యమని సాగర్‌ ప్రజలు అప్పుడు, ఇప్పుడూ విశ్వసిస్తున్నారు. అందుకు తాజాగా నా విజయమే నిదర్శనం. ఈ ఎన్నికల్లోనూ ప్రజలంతా అభివృద్ధి వైపే నిలిచారు. అప్పటి కంటే ఇప్పుడు మూడింతల మెజార్టీని కట్టబెట్టి మరింత బాధ్యతను పెంచారు. జానారెడ్డి ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆయన మాటలను పట్టించుకోలేదని ఫలితాలను బట్టి స్పష్టమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
l ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించగా ‘మా నాన్న ఇచ్చిన హామీలతోపాటు ఇప్పుడు ఇచ్చిన అన్ని హామీలను సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల సంపూర్ణ సహకారంతో నెరవేర్చేందుకు కృషి చేస్తా. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ సాగర్‌లో చేయాల్సిన ప్రతి కార్యక్రమంపై దృష్టి పెడతా. మంత్రి జగదీశ్‌రెడ్డి సవాలు చేసినట్లుగా నెల్లికల్లు లిఫ్టును పూర్తి చేసి అక్కడి గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కృషి చేస్తాం. దీంతోపాటు మిగిలి ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటా’ అని స్పష్టం చేశారు.
l సీనియర్‌ నేత జానారెడ్డిపై సాధించిన భారీ విజయంపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా ‘ఆయన్ను 2018లోనే సాగర్‌ ప్రజలు మీ సేవలు ఇక చాలు అని పక్కనపెట్టారు. ఇంకా తాము అభివృద్ధికి దూరంగా ఉండలేమని అప్పట్లోనే తేల్చిచెప్పారు. 2014లో కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. నల్లగొండ జిల్లాలో సాగు, తాగు నీటి సమస్యలకు పరిష్కారం లభించింది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ 2014లో జానారెడ్డి గెలవడంతోపాటు ఆయన అభివృద్ధిని పట్టించుకోలేదన్నది అందరికీ తెలిసిందే. అందుకే సాగర్‌ ప్రజలు 2018లో, ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటూ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. దీన్ని బట్టే ప్రజలు అభివృద్ధి వెంటే నిలబడ్డారనేది మరోసారి ఈ విజయం స్పష్టం చేసింది’ అని భగత్‌ వ్యాఖ్యానించారు.
l అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలుపొందడాన్ని ఎలా భావిస్తారూ… అనే ప్రశ్నకు బదులిస్తూ…‘ నా తండ్రి మరణానంతరం వచ్చిన ఈ ఎన్నికలు దురదృష్టకరం. అయినా ఈ ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. కేసీఆర్‌ నాపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఎన్నికల ప్రచారంలోనూ పార్టీ అభ్యర్థిగా నా విజయం కోసం మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర నేతలు, జిల్లా నుంచి కింది స్థాయిలోని సామాన్య కార్యకర్త వరకు ఎంతో కృషి చేశారు. వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఓట్లేసి గెలిపించిన సాగర్‌ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. సాగర్‌ ప్రజలకు, పార్టీ నేతలకు, శ్రేణులకు అందరికీ అందుబాటులో ఉంటూ సాగర్‌ను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందు నిలపడమే నా కర్తవ్యం’ అని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇక సాగర్‌ అభివృద్ధిపైనే దృష్టి

ట్రెండింగ్‌

Advertisement