మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jan 09, 2021 , 00:46:17

డ్రైరన్‌ సక్సెస్‌..

డ్రైరన్‌ సక్సెస్‌..

  • జిల్లా వ్యాప్తంగా 22 కేంద్రాల్లో 398 మందికి వ్యాక్సిన్‌
  • ఇప్పటివరకు  గుర్తించిన  ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ 4,800 మందికి పైనే!
  • కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం: కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

త్వరలోనే కేంద్రం నుంచి రాష్ర్టానికి వ్యాక్సిన్‌ రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కరోనా వ్యాక్సినేషన్‌కు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం  జిల్లా వ్యాప్తంగా 22 ప్రభుత్వ దవాఖానల్లో 398 మందితో డ్రైరన్‌ నిర్వహించారు. కొవిడ్‌ సాఫ్ట్‌వేర్‌ పనితీరు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సన్నద్ధత తదితర అంశాలపై ఈ సందర్భంగా దృష్టిసారించారు. టీకా పంపిణీ కోసం డ్రైరన్‌లో భాగంగా ప్రతి కేంద్రంలోనూ వెరిఫికేషన్‌, వ్యాక్సినేషన్‌, అబ్జర్వేషన్‌ గదులను ఏర్పాటు చేశారు. టీకా వికటిస్తే ఎదుర్కొనేందుకు అవసర మైన మందులు, వైద్యులు అందుబాటులో ఉండేలా డ్రైరన్‌లో అవగాహన కల్పించారు. జిల్లాలో డ్రైరన్‌ సక్సెస్‌ అయ్యిందని   కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ప్రకటించారు. టీకా వచ్చిన వెంటనే గుర్తించిన వారియర్స్‌కు  అందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.      

-యాదాద్రి భువనగిరి ప్రతినిధి, జనవరి 8(నమస్తే తెలంగాణ)

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, జనవరి 8(నమస్తే తెలంగాణ): జిల్లాలో గడిచిన ఏడు నెలల కాలంలో వేల సంఖ్యలో కరోనా బారినపడ్డారు. కరోనా మహమ్మారికి త్వరలోనే వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వ్యాక్సిన్‌ వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వారియర్స్‌ అయిన డాక్టర్లు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టులు, పారా మెడికల్‌, క్లరికల్‌ సిబ్బందితో పాటుగా ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలకూ తొలి దశలోనే వ్యాక్సిన్‌ వేయనున్నారు. అదేవిధంగా ప్రైవేట్‌ దవాఖానాల్లో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికీ వ్యాక్సిన్‌ తొలి దశలోనే ఇవ్వనున్నారు. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిపి మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు 4,800 మంది వరకు ఉన్నారు. అయితే వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడంలో భాగంగా ప్రతి పీహెచ్‌సీ పరిధిలో శుక్రవారం డ్రైరన్‌ నిర్వహించారు.

22 కేంద్రాల్లో 398 మందితో డ్రైరన్‌

కొవిడ్‌ టీకా వేయడానికి ముందుగా చేపడుతున్న సన్నాహాల్లో భాగంగా శుక్రవారం జిల్లాలోని ఏరియా దవాఖాన, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు కలుపుకుని 22 కేంద్రాల్లో 398 మందితో డ్రైరన్‌ నిర్వహించారు. ప్రతి కేంద్రంలో ఒక వ్యాక్సినేటర్‌తోపాటు నలుగురు వ్యాక్సిన్‌ ఆఫీసర్లను నియమించారు. డ్రైరన్‌లో భాగంగా ప్రతి కేంద్రంలోనూ మూడు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. కేంద్రంలోకి వెళ్లిన వారిని మొదట వెయిటింగ్‌ రూంలోకి పంపి చేతులను శానిటైజ్‌ చేసి మాస్కు తప్పనిసరిగా ధరించేలా చూశారు. పేరుతో సహా ఇతర వివరాలు, ఆధార్‌ కార్డును పరిశీలించిన తర్వాత టీకా ఇచ్చే గదిలోకి పంపి గతంలో వారు ఇచ్చిన వివరాలను నిర్ధారించుకున్నాక టీకా వేసినట్లుగా మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. టీకా వేసుకున్న వ్యక్తిని అబ్జర్వేషన్‌ గదిలోకి పంపి 30నిమిషాలు అబ్జర్వేషన్‌లో ఉంచారు. టీకా ఇవ్వడం మినహా.. వ్యాక్సినేషన్‌ సందర్భంగా నిర్వహించే అన్ని ప్రక్రియలను పకడ్బందీగా డ్రైరన్‌లో నిర్వహించారు. డ్రైరన్‌ను జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ వలిగొండ పీహెచ్‌సీలో పర్యవేక్షించారు. భువనగిరి ఏరియా ప్రభుత్వ దవాఖానలో, యాదగిరిగుట్ట, బీబీనగర్‌, ఆలేరులలో ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, బొమ్మలరామారంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మోటకొండూరు, ఆత్మకూరు(ఎం)పీహెచ్‌సీల్లో అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌, డీఎంహెచ్‌వో సాంబశివరావు, తుర్కపల్లిలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, మోత్కూరులో బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి యాదయ్య పరిశీలించారు.

డ్రైరన్‌ విజయవంతం 

జిల్లా వ్యాప్తంగా 22 కేంద్రాల్లో 398 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో నిర్వహించిన డ్రైరన్‌ సక్సెస్‌ అయ్యింది. అక్కడక్కడా సాంకేతికంగా తలెత్తిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాల్ని అధిగమించేందుకు డ్రైరన్‌ దోహదపడింది. ఇదే స్ఫూర్తితో జిల్లాలో త్వరలోనే నిర్వహించే టీకా పంపిణీని విజయవంతం చేసేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాం.

- కలెక్టర్‌ అనితారామచంద్రన్‌


VIDEOS

logo