ఊరికి వరి సాగు విప్లవం

- నారూ లేదు... నాటూ లేదు...
- వ్యవసాయంలో కూలీల కొరత
- వినూత్న ఆలోచనలతో రైతుల ముందడుగు
- వరిసాగులో సంప్రదాయ పద్ధతికి స్వస్తి
- పురాతన వెదజల్లే పద్ధతిపై అన్నదాతల ఆసక్తి
- అధికారుల ప్రోత్సాహంతో డ్రమ్ సీడర్‌తో సాగు
- పెట్టుబడి తక్కువ... దిగుబడి ఎక్కువ...
- ఆదర్శంగా నిలుస్తున్న గుండాల రైతులు
అవును.. వరి సాగులో ఏటేటా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు నారు పోయాల్సిన అవసరం లేదు.. నాటు వేయాల్సిన పని అంతకన్నా లేదు. దశాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ రైతులు వినూత్న విధానాలను అవలంబిస్తున్నారు. వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు పురాతన వెద పద్ధతితో పాటు ఆధునిక డ్రమ్ సీడర్ సాగు వైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు. ఈ పద్ధతుల్లో పెట్టుబడి ఖర్చులు మిగలడమే కాకుండా పంట దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రైతుల ఆలోచనలకు అధికారుల ప్రోత్సాహం తోడవడంతో గుండాల మండలంలో పల్లె పల్లెల్లో సాగు విప్లవం కనిపిస్తోంది. సుద్దాల, సీతారాంపురం, నూనెగూడెం, కొమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఇప్పటికే ఈ పద్ధతులు పాటిస్తూ అధిక లాభాలు పొందుతుండటం విశేషం.
- గుండాల, జనవరి 5
సాధారణంగా వరి సాగు చేయాలంటే మొదట నారు పోయాలి. అనంతరం ఏతకు వచ్చిన నారును ప్రధాన పొలంలో నాటాలి. ఇరవై నుంచి ఇరవై అయిదు రోజుల తర్వాత కలుపు తీయాలి. ఇందుకు ఎంతో మంది కూలీలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీల సమస్య అన్నదాతను వెంటాడుతుంది. అంతేకాక పెరిగిన కూలీలు, ఎరువులు, పురుగు మందుల ఖర్చుతో సాగు భారమవుతున్నది. దీంతో రైతులు నూతన సాగు విధానాలపై మొగ్గు చుపుతున్నారు. డ్రమ్‌సీడర్, వెదజల్లే పద్ధతిలో వరిని సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా మండలంలోని సుద్దాల, సీతారాంపురం, నూనెగూడెం, కొమ్మాయిపల్లిలో ఇప్పటికే డ్రమ్‌సీడర్ ద్వారా రైతులు సాగు చేపట్టారు.
డ్రమ్‌సీడర్‌తో సాగు ఇలా..
- డ్రమ్‌సీడర్‌తో సాగు చేయాలంటే మొదటగా పొలాన్ని బాగా దున్నుకోవాలి. పొలం నాలుగుమూలాలు ఎత్తుపల్లాలు లేకుండా చూసుకోవాలి. పొలం అంతటా సమానంగా నీరు నిలిచేలా గొర్రు తోలుకోవాలి. మురుగు నీరు సాఫీగా వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేయాలి.
- మంచి విత్తనాన్ని ఎన్నుకొని శుద్ధి చేసుకోవాలి. సాగు చేయాలనుకున్నప్పుడు ముందు వడ్లను నానేసుకోవాలి. 24 గంటలు నానిన తర్వాత తీసి బస్తాల్లో మండె కట్టుకోవాలి. మూడు పూటలా నీరు చల్లాలి. ముక్కులు పగులగానే నీరు పోయేవరకు ఆరబెట్టుకోవాలి.
- ముక్కు పగిలిన వడ్లను డ్రమ్ సీడర్లోని డ్రమ్ముల్లో రెండు వంతులు నింపుకొని ప్రధాన పొలంలో గుంజాలి. ఇలా గుంజేటప్పుడు పొలంలో నీరు లేకుండా పూర్తిగా తొలగించాలి. డ్రమ్ సీడర్‌ను చాలా సులభంగా లాగవచ్చు. ఒక మనిషి ఎకరం పొలాన్ని రెండు నుంచి రెండున్నర గంటల్లో పూర్తి చేయవచ్చు.
- సాధారణ పద్ధతిలో ఎకరం పొలం నాటేస్తే సరాసరి నాలుగు నుంచి ఐదు వేల ఖర్చు వస్తుంది. అదే డ్రమ్‌సీడర్ ద్వారా అయితే ఎలాంటి ఖర్చు ఉండదు. ఒకరు లేదా ఇద్దరు మనుషులతో పూర్తి చేయవచ్చు. డ్రమ్‌సీడర్ ఖరీదు కూడా చాలా తక్కువే. దీంట్లోని సైజులను బట్టి వివిధ ధరలు ఉన్నాయి.
- డ్రమ్‌సీడర్ ద్వారా గుంజిన పొలాన్ని మొదట నాలుగు ఐదు రోజులు ఆరబెట్టాలి. అనంతరం రోజు విడిచి రోజు నీరు పెట్టాలి. మొలక పెరిగేంతవరకు ఇలానే చేయాలి. మొలక పెరిగి సాళ్లు ఏర్పడగానే పలుచగా నీరు నిలుచేలా చూసుకుంటే సరి. అయితే కలుపు నివారణ కోసం ఐదు రోజుల తర్వాత వ్యవసాయాధికారుల సూచన మేరకు కలుపు మందు పిచికారి చేయాలి.
దిగుబడి ఎక్కువే..
డ్రమ్‌సీడర్ ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు. ముఖ్యంగా నాటు, కలుపు తీత ఖర్చులు తప్పడంతో పెట్టుబడి తగ్గుతుంది. అంతేకాక సాధారణ సాగుతో ఎకరానికి 40 నుంచి 45 బస్తాలు దిగుబడి వస్తుందనుకుంటే డ్రమ్ సీడర్ ద్వారా మరో ఐదు బస్తాల వరకు అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసాయాధికారులు వివరిస్తున్నారు. తక్కువ నీటిని పంటకు పారించడం.. సాళ్లమధ్య గాలి, వెలుతురు ప్రసరణతో చీడపీడల బెడద తగ్గి గింజ బరువు పెరుగడం ఖాయమంటున్నారు.
సంప్రదాయ పద్ధతి
విత్తనాన్ని నానబెట్టు కొని మండెకట్టు కోవాలి. మొలకెత్తిన తర్వాత సిద్ధం చేసిన మడిలో చల్లు కోవాలి. 15-20 రోజుల్లో ఎదిగిన నారును తీసి పొలంలో నాట్లు వేసుకోవాలి. ఇందులో సమయం, కూలీలు, నారు మడి సిద్ధం చేసుకునే పెట్టుబడి అదనం.
వెద జల్లే పద్ధతి
ఇది పురాతనమైనది. విత్తనాలు నానబెట్టుకుని ముక్కు పగిలిన తర్వాత నేరుగా దమ్ము చేసిన మడుల్లో చల్లుకోవడం. ఈ పద్ధతిలో కూలీల అవసరం లేదు. నారు పోయడం, నాటు వేయడం ఉండదు.
డ్రమ్ సీడర్‌తో ఇలా...
ముక్కు పగిలిన వడ్లను డ్రమ్ సీడర్లోని డ్రమ్ముల్లో రెండు వంతులు నింపుకొని ప్రధాన పొలంలో గుంజాలి. ఇలా గుంజేటప్పుడు పొలంలో నీరు లేకుండా పూర్తిగా తొలగించాలి. ఒక మనిషి ఎకరం పొలాన్ని రెండు నుంచి రెండున్నర గంటల్లో పూర్తి చేయవచ్చు.
కూలీల ఖర్చు తగ్గింది..
కూలీలతో వరినాట్లు వేయిస్తే ఎకరాకు నాలుగు నుం చి ఐదు వేల వరకు ఖర్చు అయ్యేది. సీజన్లో కూలీల కొరత కూడా అధికం. సాధారణ సాగులో పెట్టుబడులు పెరుగుతున్నాయి. డ్రమ్‌సీడర్‌తో మాత్రం చాలా ఖర్చు తగ్గింది. ఎకరం పొలంలో వరిని నాటేందుకు ఇద్దరు మనుషులు చాలు. కలుపు సమస్య కూడా పెద్దగా ఉండదు.
-వేణుగోపాల్‌రెడ్డి, సుద్దాల
డ్రమ్‌సీడర్ సాగు భేష్..
సాధారణ సాగుతో పోలిస్తే డ్రమ్‌సీడర్ సాగు ఎంతో ఉత్తమం. పెట్టుబడి తగ్గుతుంది. దిగుబడి సైతం పెరుగుతుంది. గింజ నాణ్యతగా వస్తుంది. కూలీలతో అవసరమే ఉండదు. పంట కూడా పదిహేను రోజుల ముందే కోతకు వస్తుంది. అధిక దిగుబడులు పొందేందుకు రైతులు నూతన పద్ధతులు అవలంబించాలి.
-సంతోషి, మండల వ్యవసాయాధికారి
అధిక దిగుబడులు వస్తాయి..
మూడు సంవత్సరాలుగా డ్రమ్‌సీడర్‌తో వరిని సాగు చేస్తున్నా. ఈ విధానంలో కూలీలతో అవసరమే ఉండదు. కలుపు సమస్య కూడా అంతంతమాత్రమే. నాటుతో పోల్చినప్పుడు డ్రమ్‌సీడర్‌తో సాగు చేసిన వరి బాగా పెరుగుతుంది. లంపు కడుతుంది. పెద్దగా పెట్టుబడి లేకుండానే ఎకరానికి 40 నుంచి 45 బస్తాల దిగుబడి వచ్చింది.
-నాయిని వెంకట్‌రెడ్డి, సీతారాంపురం
నూతన పద్ధతులు వివరిస్తున్నాం
రైతులకు నూతన పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో రైతులకు శిక్షణ ఇచ్చాం. డ్రమ్‌సీడర్ ద్వారా సాగును పెంచేందుకు కృషి చేస్తున్నాం. కూలీలు, పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో అనేక మంది రైతులు ఈ సాగు విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. సంఘం తరుపున ఇప్పటికే మండల వ్యాప్తంగా 40 నుంచి 50 డ్రమ్సీడర్లను సబ్సిడీ ద్వారా అందించాం.
-సురేందర్‌రెడ్డి, ఎఫ్‌పీసీఎల్ సీఈవో
తాజావార్తలు
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు
- ‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’