సోమవారం 01 మార్చి 2021
Yadadri - Aug 10, 2020 , 23:21:46

చ‌కా చ‌కా డంపుయార్డులు

చ‌కా చ‌కా డంపుయార్డులు

  •  గ్రామానికొకటి చొప్పున నిర్మాణం 
  •  డంపుయార్డుతోపాటు వేస్ట్‌  మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌ షెడ్డు
  • n జిల్లాలో 420 పంచాయతీలకు  398 ఎంపిక
  • 382 గ్రామాల్లో జోరుగా   సాగుతున్న పనులు  
  • ఇప్పటివరకు 120 యార్డుల నిర్మాణం పూర్తి  
  •  నెలాఖరులోపు పూర్తి చేసేలా చర్యలు  
  •  పల్లెల స్వచ్ఛతే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం

పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు నిర్వహించిన రెండు విడుతల్లో చాలా గ్రామాలు బాగుపడ్డాయి. ఏండ్ల నాటి సమస్యలకు మోక్షం కలిగింది. గ్రామస్తుల్లో చైతన్యం పెరిగింది. 

 పల్లెల స్వచ్ఛత, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రతినెలా ఠంఛన్‌గా నిధులు విడుదల చేస్తున్నది. వీటిని స్థానిక అవసరాలతోపాటు జీతభత్యాలు, కరెంటు బిల్లుల చెల్లింపునకు వినియోగిస్తున్నారు. 

 ప్రతి పల్లెను స్వచ్ఛ పల్లెగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం  గ్రామానికో డంపుయార్డు నిర్మిస్తోంది. గ్రామానికో ట్రాక్టర్‌, ట్రాలీని మంజూరు చేసింది. ట్రాక్టర్‌ ఇల్లిల్లూ తిరిగి సేకరించిన చెత్తను డంపుయార్డుకు తరలిస్తుంది. డంపుయార్డుతోపాటు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌ యార్డు కూడా నిర్మిస్తున్నారు. జిల్లాలో 420 పంచాయతీలుండగా, 398 గ్రామాల్లో ఈ యార్డులను నిర్మించాలని నిర్ణయించారు. 382 గ్రామాల్లో నిర్మాణ పనులు ప్రారంభం కాగా, ఇప్పటివరకు 120 గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. నెలాఖరుకల్లా మిగతా గ్రామాల్లోనూ పూర్తిచేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్మాణ పనులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేశారు. యార్డుల నిర్మాణం పూర్తయితే గ్రామాల్లో చాలా వరకు చెత్త సమస్య తీరడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం నెలకొననున్నది.  

-భువనగిరి  


భువనగిరి : గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. పల్లెల్లో చెత్తా చెదారాలు రోడ్ల వెంట వేయకుండా ఎప్పటికప్పుడు సేకరించి డంపింగ్‌యార్డుల్లో వేసేలా అధికారులు ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామపంచాయతీకి ఒక సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌యార్డును నిర్మిస్తున్నారు. ఇందుకుగాను రూ. 2.50లక్షలు ఖర్చుచేస్తున్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌యార్డులు పూర్తైతే పల్లెలు ప్రశాంత వాతావరణాన్ని సంతరించుకోవడంతో పాటు ఆహ్లాదంగా మారనున్నాయి. 

ఇబ్బందులకు చెక్‌

గతంలో పల్లెల్లో నిధులు లేక అరకొరగా పాలన కొనసాగేది. తెలంగాణ ప్రభుత్వంలో గ్రామస్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే ప్రతి పల్లెను పచ్చలతోరణంగా హరితస్ఫూర్తిని చేపడుతూ పారిశుధ్యలోపాలను సరిచేసేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటుంది. ప్రతి పంచాయతీకి ప్రత్యేకంగా డంపింగ్‌యార్డు నిర్మాణంతోపాటు చెత్తను వేరుచేసేందుకు వీలుగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌ యార్డుల నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. దీంతో గ్రామాల్లో ఎక్కడ కూడా చెత్తా చెదారాలు కనిపించకుండా పరిశుభ్రంగా రోడ్లు కనిపించనున్నాయి. 

పారిశుధ్యలోపం తలెత్తకుండా చర్యలు

గ్రామాల్లో పారిశుధ్యలోపం తలెత్తకుండా ఉండేందుకు వీలుగా ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 420గ్రామాలకుగాను 398గ్రామాలను ఎంపిక చేయగా అందులో 382గ్రామాల్లో నిర్మాణ పనులు ప్రారంభించారు. కాగా ఇప్పటికే 120గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నారు.  ఈనెల చివరి వరకు పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

నిర్మాణాలతో ప్రయోజనాలు

ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు,సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలకు చర్యలు చేపట్టింది. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌యార్డుల్లో ఆరు విభాగాలను రూపొందిస్తున్నారు.  ఈ యార్డులో ప్లాస్టిక్‌ కవర్లు, బ్యాగులు, సీసాలు, గాజు సీసాలు, ఇనుప వ్యర్థాలు తదితర రకాలుగా వేరు చేసి విక్రయాలు చేపట్టి గ్రామపంచాయతీలకు ఆదాయ వనరుగా మార్చుకోనున్నారు.

ఈనెల చివరికల్లా పూర్తి చేసేలాచర్యలు 


గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాల మేరకు డంపింగ్‌ యార్డులు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 420గ్రామాల్లో 398 గ్రామాలను ఎంపిక చేశాం. 382 గ్రామాల్లో పనులు చేపట్టగా అందులో 120 గ్రామాల్లో పూర్తయ్యాయి.  మిగిలిన వాటిని సైతం ఈనెల చివరివరకు పూర్తిచేసే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం.  

-మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో పీడీ, యాదాద్రి భువనగిరి 

VIDEOS

logo