గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Mar 30, 2020 , 23:15:05

రైతన్నా.. నేనున్నా..

రైతన్నా.. నేనున్నా..

  • లాక్‌డౌన్‌ వేళ అన్నదాతల్లో ధైర్యం నింపిన సీఎం కేసీఆర్‌
  • ప్రతి గింజను కొంటామని చెప్పడంతో రైతుల్లో సంతోషం 
  • హార్వెస్టర్ల సమస్యలు తొలగిస్తామనడంపై సర్వత్రా హర్షం
  • ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో యాసంగి వరి కోతలు మొదలు 
  • బత్తాయి, నిమ్మ కొనుగోళ్లకు నేటి నుంచి మొబైల్‌ రైతు బజార్లు 
  • విపత్తు సమయంలో ప్రభుత్వాధినేత భరోసాపై ఆనందం 

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆపద కాలంలో నేనున్నానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన రైతుల్లో ధైర్యాన్ని నింపింది. కరోనా వైరస్‌ను పారదోలేందుకు దేశమంతటా లాక్‌డౌన్‌ నెలకొన్న నేపథ్యంలో పంటల కోత, విక్రయంపై ఆందోళన నెలకొనగా.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడు ప్రతి సమస్యను ప్రస్తావిస్తూ పరిష్కారాన్ని సైతం ఆదేశిస్తూ ఆదివారం సీఎం కేసీఆర్‌ నెలకొల్పిన ధైర్యంపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కృష్ణా.. మరోవైపు గోదావరి జలాలకు తోడు మూసీ నీటితోను ఈసారి ఉమ్మడి జిల్లా అంతటా యాసంగి వరి పంట విరివిగా పండగా.. పలు ప్రాంతాల్లో వరి చేలు కోతకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి రైతుకు భరోసానిస్తూ.. ‘పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్మి మోసపోవద్దు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలోని రైతులందరికీ సూచించిన సంగతి తెలిసిందే. బత్తాయి, నిమ్మ కొనుగోలుకు పట్టణాల్లో మొబైల్‌ రైతు బజార్లు నేటి నుంచే ఏర్పాటు కానున్నాయి. 

కృష్ణా నది పొంగి పొర్లడంతో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వతోపాటు ఏఎమ్మార్పీ ఎగువ, దిగువ కాల్వల పరిధిలోనూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి యాసంగి వరి సాగు విస్తృతంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సూర్యాపేట జిల్లాలోని చివరి చెరువును సైతం నింపిన విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కృషి ఫలితంగా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని నాన్‌ ఆయకట్టులోనూ యాసంగి వరి సాగు రికార్డు స్థాయిలో జరిగింది. కృష్ణా, గోదావరితోపాటు మూసీ నది కుడి, ఎడమ కాల్వల ద్వారా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని సుమారు 30వేల ఎకరాల ఆయకట్టులోనూ వరి పంట పండింది. ఇప్పటికే మంత్రి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ధాన్యం కొనుగోళ్లకు ఆదేశించడం విదితమే.

రికార్డుస్థాయిలో దిగుబడి అంచనా... 

ఉమ్మడి జిల్లా అంతటా విస్తృతంగా వరి పంట పండగా.. దిగుబడి సైతం రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలో 72,974హెక్టార్ల సాధారణ సాగుకు గాను యాసంగిలో 1,45,528 హెక్టార్లలో వరి సాగు చేశారు. హెక్టారుకు సగటున 5.25మెట్రిక్‌ టన్నుల చొప్పున మొత్తం 7,64,022మెట్రిక్‌ టన్నుల దిగుబడిని అధికారులు అంచనా వేశారు. రైతుల వ్యక్తిగత అవసరాలు మినహా దాదాపుగా 5.96 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యంగా నిర్ణయించుకున్న యంత్రాంగం.. జిల్లాలో 376కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. గతంలో ఈ సంఖ్య కేవలం 224మాత్రమే ఉండేది. సూర్యాపేట జిల్లాలో ఈసారి కృష్ణాతోపాటు, గోదావరి, మూసీ జలాల ఫలితంగా యాసంగి వరిసాగు మూడింతలు పెరిగింది. మొత్తం 1.49లక్షల హెక్టార్లలో సాగు చేయగా.. రైతుల అవసరాలు పోను మొత్తం 4,18,600మెట్రిక్‌ టన్నుల లక్ష్యం నిర్ణయించింది. పంట సాగు ఆధారంగా ఆయా మండలాల్లో 290కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాళ్‌కు రూ.1835, సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1815గా మద్దతు ధర నిర్ణయించిన ప్రభుత్వం.. అంతకంటే తక్కువ ధరకు ఏ రైతు కూడా దళారులకు పంటను అమ్ముకోవద్దని చెప్పింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాలకు ధాన్యం వస్తోంది. ఈ మేరకు ధాన్యంపై అన్ని ఏర్పాట్లు చేపట్టిన సీఎం కేసీఆర్‌.. అంతకు ముందే బత్తాయి, నిమ్మ సహా పండ్ల తోటల రైతులందరి గురించీ ఆలోచించారు. నేటి నుంచే జిల్లా వ్యాప్తంగా మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో సిట్రస్‌ జాతికి చెందిన నిమ్మ, బత్తాయిలు తినడం ద్వారా ‘సీ’ విటమిన్‌ పెంచుకోవచ్చని కేసీఆర్‌ వివరంగా చెప్పడంతో స్థానికంగానే పండ్ల అమ్మకాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. నల్లగొండ జిల్లా అంతటా 46,800ఎకరాల్లో బత్తాయి, 16వేల ఎకరాల్లో నిమ్మ తోటలు రైతులు సాగు చేశారు. బత్తాయి 44వేల మెట్రిక్‌ టన్నులు, నిమ్మ 52వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా.  


ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది..

రాష్ట్రమంతటా యాసంగి వరి కోతల సమయం ఇది. కోటి మెట్రిక్‌ టన్నులకు పైగా వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నరు. కరోనా నేపథ్యంలో మార్కెట్లు మూతపడ్డ కారణంగా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. మీ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వమే ప్రతి గింజను సైతం కొనుగోలు చేస్తుంది. వరి కోతలకు ఉపయోగించే హార్వెస్టర్ల గురించి కూడా రైతులు ఆందోళన చెందొద్దు. వరి పంట కోయడానికి ట్రాక్టర్లకు హార్వెస్టింగ్‌ మెషిన్లు ఎక్కిచ్చేందుకు సైతం టెక్నీషియన్లను గ్రామాలకు అనుమతించాలని అధికారులను ఆదేశిస్తున్న. 

- ఈ నెల 29న విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌

నల్లగొండ జిల్లాలో...

యాసంగి వరి సాగు  : 1.45 లక్షల హెక్టార్లు

కొనుగోలు లక్ష్యం  : 5.96 లక్షల మెట్రిక్‌ టన్నులు

కొనుగోలు కేంద్రాలు  : 376

సూర్యాపేట జిల్లాలో.. 

యాసంగి వరి సాగు : 1.49 లక్షల హెక్టార్లు

కొనుగోలు లక్ష్యం :  4.18 లక్షల మెట్రిక్‌ టన్నులు 

కొనుగోలు కేంద్రాలు :  290

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..

కష్టకాలంలో రైతులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులంతా రుణపడి ఉంటరు. గ్రామాల్లోనే ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనడమే గాకుండా మద్దతు ధర దక్కేలా తోడుంటానని చెప్పడం గొప్ప విషయం. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. 

- గుగులోతు దస్రూనాయక్‌, కోక్యానాయక్‌తండా, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా

కేసీఆర్‌ రైతు బాంధవుడు...

ఐదెకరాల్లో సాగు చేస్తున్న వరి కోతకొచ్చింది. అమ్ముకునే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. హార్వెస్టర్ల పరికరాలను సైతం అందుబాటులో ఉంచి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన కేసీఆర్‌ నిజంగా రైతు బాంధవుడు. 

- చలికంటి యాదగిరి, రైతు, జప్తివీరప్పగూడెం, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా 

కేసీఆర్‌కు రైతుల ఇబ్బందులు తెలుసు...

సీఎం కేసీఆర్‌కు రైతుల బాధలు తెలుసు. హార్వెస్టర్లను, వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలకు ఎలాంటి ఇబ్బందులు రానియొద్దని అధికారులను ఆదేశించాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఆందోళనకు గురయ్యాం. కానీ, మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనాలని ఆదేశించడం సంతోషంగా ఉంది. 

- కొట్టు బాబు, రైతు, హుజూర్‌నగర్‌, సూర్యాపేట జిల్లా


VIDEOS

logo