కాశీబుగ్గ, జూలై 31 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని పల్లి, పసుపుయార్డులో చిరు వ్యాపారుల హవా కొనసాగుతున్నది. రైతులు విక్రయించేందుకు మార్కెట్కు పచ్చి, ఎండిన పల్లి కాయలు వేర్వేరుగా తీసుకువస్తుండడం తో చిరు వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్ పరిధిలో లైసెన్స్ ఉన్న వ్యా పారులకు సరుకు దొరకడం లేదు. యాదాద్రి భువనగిరి, జనగామ, హుజూరాబాద్, నర్సంపేట, పరకాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చిరువ్యాపారులు మార్కెట్కు వస్తున్నారు.
ఇక్కడ కొనుగోలు చేసి బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాం తాల్లోని చిల్లర వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వీరు పచ్చి పల్లికాయ కొనుగోలు చేయడంతో మా ర్కెట్ కమిటీ ఆదాయానికి గండి పడుతున్నది. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలిసింది. యార్డు ఇన్చార్జి, సూపర్వైజర్లు జీరోకు సంబంధించి చిన్న వ్యాపారుల వద్ద డబ్బులు వసూ లు చేస్తున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ప్రతిరోజు వందల సంఖ్యలో పల్లికాయ బస్తాలు మార్కెట్కు వస్తే కేవలం 30-100 వరకు మాత్రమే వచ్చినట్లు రికార్డుల్లో చూపుతున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆదాయానికి గండి పడుతున్నదన్న విషయం మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.