పెద్దవంగర, జూలై 19 : కరెంట్‌పై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పెద్దవంగర పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో బుధవారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతు బాగుంటేనే అన్ని విధాలా అభివృద్ధి సాధించవచ్చనే సంకల్పంతో వారికి అన్ని సౌలతులు కల్పిస్తున్నారని అన్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి రైతన్నలే తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మూడు గంటలు ఇచ్చే కరెంట్ కావాలో?.. ప్రభుత్వం అందిస్తున్న సాగు నీరు, ఉచిత కరెంట్‌తో మూడు పంటలు కావాలో ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చి, బీడు బారిన నేలల్లో ధాన్యపు రాశులు పండించేలా దూ రదృష్టితో ప్రాజెక్టులను కట్టించారన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని యువతీయువకులకు ఉచితంగా నిర్వహించే డ్రైవింగ్ లైసెన్స్ మేళా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో మహిళలు, యువత అభివృద్ధి కోసం పనులు చేపట్టాలనే లక్ష్యంతో మహిళలకు ఉచిత ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరికేలా కుట్టుమిషన్ల శిక్ష ణ, మిషన్ల పంపిణీని చేపట్టామని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యమన్నారు. ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. వరంగల్‌లోని టెక్స్టైల్ పార్కు బస్సులు ఏర్పాటు చేసి, నియోజకవర్గ మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చేస్తామన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న యువతులకు ఉచితంగా నర్సింగ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిసామని మంత్రి వెల్లడించారు. వారికి స్వయం ఉపాధి కోసం కిమ్స్ దవాఖానకు సంబంధించిన కళాశాలలో శిక్ష ణ ఇప్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వచ్చినా వెళ్లొచ్చని, పూర్తిస్థాయి శిక్షణ పొందిన వారికి 100 శాతం నర్సింగ్ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామన్నారు.