కరీమాబాద్/కాశీబుగ్గ, జూన్ 26: మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సత్య శారదాదేవి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మామునూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు. వాటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం మాదకద్రవ్యాలపై పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. తర్వాత మామునూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో ‘సాక్ష్యం స్పష్టంగా ఉంది.. నివారణ పెట్టుబడి’ అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీ రవీందర్, జిల్లా సంక్షేమశాఖ అధికారి హైమావతి, మామునూరు ఏసీపీ తిరుపతిరావు, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. పోచమ్మమైదాన్ నుంచి మండిబజార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంతేజార్గంజ్ సీఐ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ యువత బంగారు భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందన్నారు. ఎస్సై వెంకన్న, విద్యార్థులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట: యువత వ్యసనాలకు బానిస కావొద్దని చెన్నారావుపేట వైద్యాధికారి సరోజ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని పీహెచ్సీలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల తమ జీవితాలు నాశనం కావడంతోపాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఖానాపురం/గీసుగొండ: యువత మత్తు పదార్థాల బా రిన పడొద్దని మండల వైద్యాధికారి జ్యోతి కోరారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేటి యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడి జీ వితాలను నాశనం చేసుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ సునీత, హెల్త్ సూపర్వైజర్ రామలింగయ్య, హెల్త్ అసిస్టెంట్లు భాస్కర్, రాంప్రసాద్‌రెడ్డి, ఏఎన్ఎంలు సునీత, ప్రతిభ, భార్గవి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, గీసుగొండ పీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఆవగాహన కార్యక్రమంలో వైద్యాధికారి అర్చన మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని కోరారు. కార్యక్రమంలో సీహెచ్‌వో మధుసూదన్‌రెడ్డి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.