రాయపర్తి, అక్టోబర్ 11: పండుగ పూట జిల్లాలో విషాదం అలుముకుంది. దసరా వేడుకలు నిర్వహించుకోవాల్సిన పలువురి ఇండ్లలో చావుడప్పు మోగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలతో పలు గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ హృదయవిదారక ఘటనలు రాయపర్తి మండలంలోని కిష్టాపురం, ఖిలావరంగల్ మండలం వసంతపురం, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో చోటుచేసుకున్నాయి.
రాయపర్తి ఎస్సై కొంగ శ్రవణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎర్ర లలిత-శ్రీనివాస్ దంపతుల ఏకైక కుమారుడు రాజు(24), తన మిత్రుడైన ఈదునూరి కల్యాణి-యాకయ్య దంపతుల కుమారుడు అన్వేష్ అలియాస్ బన్నీ(18)తో కలిసి గురువారం రాత్రి గ్రామంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి సమయంలో రాజు తన బైక్‌పై బన్నీని ఎక్కించుకొని కాట్రపల్లికి వెళ్తున్నాడు.
మార్గమధ్యంలో వాంకుడోతుతండా క్రాస్‌రోడ్డు సమీపంలో మితిమీరిన వేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన రాజు, బన్నీ అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం వాంకుడోత్ తండావాసులు గుర్తించి మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కలచివేశాయి.
ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కిష్టాపురానికి చెందిన తోట చంద్రయ్య, సందీప్‌కుమార్ కారులో కిష్టాపురం నుంచి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి వైపు వెళ్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కొట్టం సంపత్‌కుమార్ కిష్టాపురం క్రాస్‌రోడ్ నుంచి బైక్‌పై గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో కిష్టాపురం-పన్యానాయక్తండా మార్గమధ్యంలో ఎదురెదురుగా ఢీకొనడంతో కొట్టం సంపత్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు.
గీసుగొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ గొర్రెకుంట క్రాస్‌రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన గుండ్లపల్లి అఖిల్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిల్ తన బైక్‌పై ఉప్పరపల్లి నుంచి వరంగల్‌కు వెళ్తున్నాడు. గొర్రెకుంట క్రాస్‌రోడ్ వద్ద నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టడంతో అఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్ తెలిపారు.
ఖిలావరంగల్: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దూపకుంట రోడ్డులో జరిగిన ఘటన వివరాలను స్థానికులు వెల్లడించారు. వసంతపురం గ్రామానికి చెందిన డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి శ్రీనివాస్(19) రంగశాయిపేట నుంచి తన బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఖిలావరంగల్‌కు చెందిన గుమస్తా బండి అనిల్ దూపకుంట రోడ్డు నుంచి రంగశాయిపేట వైపు వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. దీంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అనిల్‌ను ఎంజీఎం దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.