నల్లబెల్లి, మార్చి 23 : శ్రమదానంతో యువత రోడ్డును పునరుద్ధరించారు. వివరాల్లోకి వెళ్తే..శనిగరం జాతీయ రహదారి నుండి కన్నారావుపేట వరకు మూడు కిలోమీటర్ల మేర తారు రోడ్డు గుంతల మయమైంది. ప్రజలు పలుమార్లు రోడ్డు ప్రమాదాలకు గురై గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధుల పాలన ముగియడంతో మండలంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే కన్నారావుపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం గుంతల మయమైనా ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంతో మేమున్నామంటూ గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ముందుకు వచ్చారు.
శ్రమదానం చేసి మూడు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్డును పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ సభ్యులను పలువురు అభినందించారు. శ్రమదానంలో ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు పల్నాటి మూర్తి, కార్యదర్శి తండా సంపత్ గౌడ్, సభ్యులు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పులి అన్వేష్ గౌడ్, బండారి మణికుమార్, సనుప భద్రయ్య, బండారి వర్ధన్, తండ రాజు గౌడ్, సార్ల కర్ణాకర్ రెడ్డి తో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు.