పర్వతగిరి, జూన్ 16 : అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ యువకుడు నిరసనకు దిగాడు. ఊరిలోని వాటర్ ట్యాంక్ ఎకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ము తండాలో చోటుచేసుకోగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన ధరావత్ సుమన్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గతంలో అతడికున్న ఇల్లు కాలిపోయింది. దీంతో తనకు ఇందిరమ్మ పథకంలో ఇల్లు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇటీవల ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అతని పేరు లేదని తెలియడంతో సుమన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇండ్లు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే సుమన్ ఊరిలోని వాటర్ ట్యాంక్ ఎకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు అన్ని అర్హతలున్నా ఇల్లు ఇవ్వలేదని, అనర్హులకు కేటాయించారని మండిపడ్డాడు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అకడకు చేరుకొని సుమన్‌ను సముదాయించి కిందకు దించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.