Takshakudu Movie | యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘తక్షకుడు’. గతంలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని అందించిన దర్శకుడు వినోద్ అనంతోజు, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే ఇది పక్కా రివెంజ్ డ్రామాగా కనిపిస్తోంది. పెళ్లయిన రోజే తన కుటుంబాన్ని కోల్పోయి, తీవ్ర గాయాలతో అడవిలో పడి ఉన్న యువకుడిని స్థానికులు కాపాడటం, ఆ తర్వాత తన పతనానికి కారణమైన వారిపై అతను తీర్చుకునే ప్రతీకారమే ఈ చిత్ర కథాంశమని అర్థమవుతోంది.
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ మునుపెన్నడూ లేని విధంగా చాలా ఇంటెన్స్ మరియు సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇక ‘లాపతా లేడీస్’ ఫేమ్ నితాన్షీ గోయల్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, కాలకేయ ప్రభాకర్ కీలకమైన నెగటివ్ రోల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.