ఏడాది క్రితం వరకు ఎటుచూసినా పచ్చని పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక అదునుకు గోదావరి జలాలు అందించి ఏండ్ల నాటి కరువును దూరం చేసింది. రైతన్న ఇంట సిరుల పంటలు పండగా వ్యవసాయాన్ని పండుగలా మారింది. అంతేగాక ఉపాధి కోసం దశాబ్దాల క్రితం వలసపోయిన ఎన్నో కుటుంబాలు సొంతూళ్లకు తిరిగిరావడంతో పదేళ్లలో జీవనచిత్రం సరికొత్తగా ఆవిష్కృతమైంది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రైతులకు మళ్లీ కష్టకాలం దాపురించింది. నాడు ఎండాకాలంలోనూ మత్తళ్లు దూకిన చెరువులు, కుంటలు ప్రస్తుతం వట్టిపోవడం.. భూగర్భ జలాలు అంతకంతకూ పడిపోతుండడంతో ఎండిన వరి పొలాలు పశువులను మేపాల్సిన దుస్థితి వచ్చింది. అటు నీట జాడ లేక మడులకు తడి అందక కండ్ల ముందే పచ్చని పంట ఎండిపోతుండడంతో రైతన్న కలవరపెడుతున్నది.
– జనగామ, మార్చి 1 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో యాసంగి సీజన్లో మొత్తం 1.99 లక్షల ఎకరాల్లో వరి, మక్కజొన్న వంటి వివిధ పంటలు సాగు చేస్తారనే అంచనా వేయగా 1.72 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు వేశారు. అందులో 1.60 ఎకరాల్లో వరి పంట వేశారు. ఇప్పటికే సాగునీటి కటకటతో పలుచోట్ల 30శాతం పంటలు ఎండిపోగా మరి కొద్దిరోజులు పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో కరువుకు చిరునామాగా సముద్ర మట్టానికి 550 మీటర్ల ఎత్తైన డ్రాట్ ఏరియాగా ముద్రపడి బోర్లు వేసేందుకు, ఇసుక తీయటానికి వీళ్లేదని నిషేధాజ్ఞలకు గురైన అతి దుర్భిక్షాన్ని ఎదుర్కొన్న జనగామ ప్రాంతం కేసీఆర్ సర్కారు ఏర్పడిన తర్వాత దేవాదుల ద్వారా అందిన సాగునీటితో రికార్డుస్థాయిలో పండిన ధాన్యంతో పచ్చని కోనసీమ అయ్యింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జనగామ జిల్లాకు దేవాదుల నీటి పంపింగ్ ఆగిపోవడంతో జిల్లాలోని 7 రిజర్వాయర్లకు గానూ నర్మెట మండలం బొమ్మకూరు, లింగాలఘనపురం మండలం నవాబుపేట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఆర్ఎస్ ఘన్పూర్, రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. వర్షపాతం తక్కువగా ఉండే జనగామ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు నుంచి ఆయా రిజర్వాయర్లకు గోదావరి నీటిని పంపింగ్ చేసి కాలువల ద్వారా చెరువులు, కుంటలు, ఇతర చిన్ననీటి వనరులు నింపిడం వల్ల ఎండాకాలంలోనూ నిండుగా మారి భూగర్భజలాలు సంవృద్ధిగా ఉండేవి.
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 953 చెరువులు, కుంటల పరిధిలో 68,962 ఎకరాల ఆయకట్టు ఉంటే వాటిలో 336 వనరుల్లో నీటి మట్టాలు 25 శాతానికి పడిపోయాయి. మరో 313 నీటి వనరుల్లో 25 నుంచి 50శాతంకు ఇంకో 183 నీటి వనరుల్లో 50 నుంచి 75 శాతం, 121 వనరుల్లో 75 నుంచి 100శాతం నీటి నిల్వలు పడిపోయాయి. జిల్లాలో కేవలం 400 చెరువుల్లో మాత్రమే ప్రస్తుతం నీటి జాడలు కనిపిస్తున్నాయి. గతంలో 90 శాతంకు పైగా గ్రామాలలో నీటి వనరులన్నీ దేవాదుల నీటితో నింపి పంటలకు సాగునీరందడం సహా భూగర్భ జల నీటి మట్టం పెరిగి బోర్లు వేసినా..బావులు తవ్వినా 80 నుంచి 100 ఫీట్ల లోపు నీటి జాడలు ఉబికివచ్చేవి.
ప్రస్తుత యాసంగి సీజన్లో దేవాదుల నీటిని విడుదల చేయకపోవడంతో చెరువులు, కాల్వలు ఎండిపోయి బోరు బా వులు ఒట్టిపోయి వరి, మక్కజొన్న వంటి పంటలు ఎండిపోతున్నా యి. జిల్లాలోని గండిరామారం, బొమ్మకూరు, చీటకోడూరు, నవాబుపేట, ఆర్ఎస్ ఘన్పూర అశ్వరావుపల్లి రిజర్వాయర్లు సీజన్‌కు ముందు సాకాలంలో నింపి వాటి ద్వారా చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేయడంలో అధికార ప్రభుత్వం విఫలమైంది. అదనులో పంటలకు సరిపడా తడులు అందిస్తే భూగర్భజలాలు సైతం లోతుకు పడిపోకుండా నిలకడగా ఉండేవని రైతులు చెబుతున్నారు.
2024 జనవరిలో 6.91 మీటర్ల లోతులో నీరుంటే..2025 జనవరి నాటికి (ఏడాది తర్వాత) 7.15 కిందకు పడిపోయి జిల్లాలో భూగర్భజలాలు అధికారికంగా 0.79గా నమోదై కరువు ఛాయలు సూచిస్తున్నాయి. జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి, లింగాలఘనపురం, నర్మెట, చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్గడ్ మండలాల్లో ఇప్పటికే వరి ఎండిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడూ సాగునీటి కటకట ఎరుగని రైతులు ఈసారి పెట్టుబడుల దక్కే పరిస్థితి లేకపోగా తమ కళ్ల ముందే పచ్చటి పంటలను పశువుల మేతకు కోసి వేయాల్సిన దుస్థితి నెలకొనడం కంట నీరు తెప్పిస్తున్నది.
ఒకనాడు కరువు, దుర్భిక్షానికి కేరాఫ్‌గా ఉండే జనగామ ప్రాంతం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాదుల నీటి ద్వారా కరువును జయించి అంచనాలకు మించి వరి సాగై ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రికార్డు స్థాయిలో ధా న్యం పండింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే జిల్లాలో నీటి మట్టాలు దారుణంగా పడిపోయి మళ్లీ కరువుకాలం ముంచుకు వస్తుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. దేవాదుల ద్వారా రిజర్వాయర్లు నింపి అక్కడి నుంచి గ్రామాల్లో చెరువులు, కుంటలకు నీటిని తరలిస్తే తప్ప యాసంగి సీజన్ గట్టెక్కే పరిస్థితి కనిపిస్తున్నది.