హనుమకొండ సబర్బన్, ఫిబ్రవరి 28 : తెలంగాణ ఉద్యమ ఉధృతిని తట్టుకోలేక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జే చొక్కారావు(దేవాదుల) లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించారు. ఇది రెండు దశల నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ కేటాయించిన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ములుగు జిల్లా కన్నాయిగూడెం వద్ద గోదావరి నదిపై సమ్మక్క బరాజ్ నిర్మించి పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరందించారు. ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి ఉత్తర, దక్షిణ కాల్వలకు నీటిని సరఫరా చేశారు.
అయితే ఆ కాల్వలు ఇప్పుడు లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయి. ముఖ్యంగా ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఉత్తర కాల్వను నిర్మించారు. 24 కిలోమీటర్ల వరకు ప్రధాన కాల్వ తవ్వగా దానికి 13 డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేశారు. ఇందులో సగం మేరకు కాల్వల షట్టర్లు మరమ్మతులో ఉండగా, డిస్ట్రిబ్యూటరీ 7లో షట్టరే లేదు. దీంతో నీరు మొత్తం వృథాగా పోతున్నది. ప్రధాన కాల్వ మొత్తం సిల్ట్, ముళ్ల పొదలతో మూసుకుపోయింది. సిమెంట్ స్ట్రక్చర్లకు ఇష్టారీతిన రంధ్రాలు వేశారు. గతంలోనే ప్రధాన కాల్వ రిపేరుకు ప్రతిపాదనలు పంపగా ఇటీవలే రూ. 26 లక్షలు మంజూరయ్యాయి.
దేవాదుల ఉత్తర కాల్వ నాలుగు మండలాల పరిధిలో ఉండగా, 119 కిలోమీటర్ల మేర పిల్ల కాల్వలు తవ్వారు. అయితే ఈ కాల్వల్లో నీరు రాకపోవడంతో కొందరు రైతులు చదునుచేసుకున్నారు. ఎల్కతుర్తి మండలంలో గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు కాల్వల అలైన్మెంట్ను ఇష్టారీతిగా మార్చేశారు. ఇందుకోసం నీటి పారుదల శాఖ అధికారులకు భారీగానే ముడుపులు ముట్టినట్లు ఆరోపణలున్నాయి.
దీనికి తోడు పలువురు గ్రానైట్ యజమానులు కాల్వలపైనే నిర్మాణాలు చేపట్టగా మరికొందరు డస్ట్ నింపుతున్నారు. ఈ విషయమై రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అయితే పిల్ల కాల్వల మరమ్మతులు ఉపాధి హామీ పథకంలో చేసుకోవాలని ఎంపీడీవోలకు సూచించినప్పటికీ వారు స్పందించడం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ కాల్వల కింద ఆయకట్టు కాగితాల్లోనే కనిపిస్తున్నదని, క్షేత్రస్థాయిలో మాత్రం సగం కూడా పారడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు పిల్ల కాల్వలను పట్టించుకోక, నీటి విడుదలలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో యాసంగి పంటలు ఎండుతున్నాయని వారు వాపోతున్నారు.
నేను బడికి పోయేటప్పుడు ఈ దేవాదుల కాల్వను తవ్విండ్రు. ఇగ మనకు సావు లేదు.. నీళ్లు వస్తయని మా బాపు చెప్పెటోడు. ఇన్నేం డ్లు గడిచినా ఇప్పటికైతే నేను నీళ్ల సుక్క సూడలేదు. భవిష్యత్తులో వస్తయనే నమ్మకం లేదు. గ్రానైట్ కంపెనోళ్లు ఇష్టం వచ్చినట్లు కాల్వల డిజైన్లు మార్చుతున్నరు. ఎవరూ పట్టించుకుంటలేరు.
– కొమ్మిడి రమణారెడ్డి, రైతు, ఎల్కతుర్తి
దేవాదుల ఉత్తర ప్రధాన కాల్వ పరిధిలో 119 కిలోమీటర్ల మేర పిల్ల కాల్వలు ఉన్నాయి. ఇవి మూసుకుపోయిన చోట ఉపాధి హామీ పనులు కేటాయించి మరమ్మతు చేయించాలని దీని పరిధి ఎంపీడీవోలకు ఏడాది నుంచి చెబుతున్నాం. అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చ లేదు. ఈసారి కూడా చెప్పాం. ప్రధాన కాల్వ రిపేరుకు మాత్రం రూ. 26 లక్షలు మంజూరయ్యాయి.
– ప్రశాంతి, డీఈ, నీటిపారుదల శాఖ