స్టేషన్ ఘన్పూర్ : రాష్ట్రంలో విద్యా రంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు యాకన్న రాథోడ్ అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలకు అలాగే ఎస్ఎంహెచ్ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అద్దె భవనాలు ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు, ఫీజు రీఎంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విద్యా సంస్థలలో టాయిలెట్స్, మరుగుదొడ్లు, తరగతి గదులలో ఫ్యాన్లు, లైట్స్, తాగునీరు, వంటగదులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పట్టించుకోకుండా విద్యారంగాన్ని బ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ వారి కొమ్ముకాస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగా సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. లేనియెడల రాబోయే రోజులలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో బస్సు చార్జీలు పెంచడం సరికాదన్నారు.