Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తేతెలంగాణ): మరికొన్ని గంటల్లో మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్, మేయర్ ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగింపునకు దిగింది. పోలింగ్‌లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఆ పార్టీ ఇప్పుడు దొడ్డిదారిన గద్దెనెక్కేందుకు యత్నిస్తున్నది. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన చోట్ల అరాచక పర్వానికి తెరలేపింది. అంగ, అర్థ బలాలతో బల్దియాలను కైవసం చేసుకొనేందుకు కుయుక్తులకు దిగుతున్నది. కొందరు పోలీసులు, ఆ పార్టీ గూండాల అండతోరెచ్చిపోతున్నది. ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను దారికి తెచ్చుకొనేందుకు సామ, ధాన, బేధ, దండోపాయాలను ప్రయోగిస్తున్నది. స్వతంత్ర, బీఆర్ఎస్, ఇతర పార్టీల కౌన్సిలర్లను ఇష్టారాజ్యంగా ప్రలోభాలకు గురిచేస్తున్నది. పెద్దమొత్తంలో డబ్బు ఆశచూపుతూ పట్టపగలు ప్రజాస్వామ్య హననానికి ఒడిగడుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల ఏకంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని కిడ్నాప్ చేసి రాజ్యాంగ విలువలకు పాతరేసింది. అర్ధరాత్రి వేళ మఫ్టీలో ఉన్న పోలీసులను బీఆర్ఎస్ క్యాంపుల్లోకి ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియకు తిలోదకాలిస్తున్నది.
ఇటీవల కాంగ్రెస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో 90 శాతానికి పైగా మున్సిపాలిటీలను దక్కించుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలకు సూచించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఎలాగైనా మేయర్/చైర్పర్సన్ పీఠాలను కైవసం చేసుకొనేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. పరిగి బీఆర్ఎస్ కౌన్సిలర్ల శిబిరంలోకి శనివారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత మఫ్టీలో ఉన్న ఓ పోలీసు చొరబడటం కలకలం సృష్టించింది. హైదరాబాద్ మణికొండలోని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు దౌర్జన్యం చేస్తూ హల్చల్ చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలీటిలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు. ఫోన్‌ట్యాపింగ్ చేసి తెలుసుకున్న పోలీసులు అక్కడికు మఫ్టీలో వెళ్లగా పార్టీ నాయకులు అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను పోలీసుల సాయంతో కాంగ్రెస్ గూండాలు బలవంతంగా తమ క్యాంపులోకి తీసుకెళ్లారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులకు కాంగ్రెస్ డబ్బు ఆశచూపి తరలించేందుకు యత్నించినట్టు తెలిసింది.
మున్సిపల్ పాలవర్గాలు కొలువుదీరనున్న వేళ అధికార పార్టీ సరికొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని చోట్ల గొడవలు సృష్టించి ఎన్నికను వాయిదా వేసేందుకు కుయుక్తులు పన్నుతున్నది. ముఖ్యంగా బీఆర్ఎస్కు అవకాశం ఉన్న మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, తూఫ్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలను దొడ్డిదారిన చేజిక్కించుకొనేందుకు యత్నిస్తున్నది. పోలీసులను ఎన్నికల విధుల నుంచి తప్పించి ఏడుపాయల, ఇతర ప్రధాన శివాలయాల వద్ద జాతర బందోబస్తుకు పంపినట్టు తెలుస్తున్నది. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు గొడవలకు దిగి ఎన్నిక ప్రక్రియను నిలిపివేసేలా పథకం రచించినట్టు బీఆర్ఎస్ నాయకులు అనుమానిస్తున్నారు.
పరిగి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల శిబిరానికి అర్ధరాత్రి సమయంలో మఫ్టీలో ఉన్న ఓ పోలీసు వెళ్లడం తీవ్ర కలకలం సృష్టించింది. పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులకు 8 వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మరో 8 వార్డుల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలుపొందారు. రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. పరిగి మున్సిపాలిటీలో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు చీరాలలో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి వేళ మఫ్టీలో ఉన్న ఓ పోలీస్ అక్కడికి వెళ్లి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించసాగాడు. దీంతో ‘మీరెవరు?సీసీ టీవీ ఫుటేజీలను ఎందుకు చెక్ చేస్తున్నారు? చెక్ చేయడానికి వారెంట్ ఉన్నదా? అని అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు భాస్కర్, అశోక్‌వర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్, రవికుమార్, వారాల రవి తదితరులు ప్రశ్నించారు. తనది వేటపాలం అంటూ అతను పొంతనలేని సమాధానం చెప్తూ పారిపోయేందుకు యత్నించాడు. బీఆర్ఎస్ నాయకులు పట్టుకొని గట్టిగా నిలదీయడంతో తాను కానిస్టేబుల్‌నని ఒప్పుకొన్నాడు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మణికొండలోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేసేందుకు నానా హంగామా చేశారు. రోహిత్‌రెడ్డి నివాసాన్ని తాండూర్ నుంచి వచ్చిన 50 మంది పోలీసులు నిర్బంధించారు. ఇంటి బయట ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. కొందరి సెల్ఫోన్లను లాక్కొన్నారు. రోహిత్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టి, ఆయనను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించారు. ఆయన ఇంట్లో ఆయన లేకపోవడంతో రెండు గంటలపాటు తనిఖీలు చేసిన పోలీసులు వెనుతిరిగారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు రోహిత్‌రెడ్డి ఇంటిని తనిఖీలు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా నిరసించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నాయకులపై వేధింపులను మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ తాండూరు ఎన్నికల ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి ఆరోపించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల నిబంధనలు పాటించకుండా కోడ్‌ను ఉల్లంఘించిన తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేయకపోవడం వివక్షే అని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కాకుండా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. పోలింగ్ సందర్భంగా ఓట్లను తారుమారు చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, కాంగ్రెస్ నాయకులు కరణం పురుషోత్తం, మాజీ చైర్పర్సన్ స్వప్న పరిమళ్, రవిగౌడ్ ప్రయత్నించారని ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వెళ్లారని ఆరోపించారు. ఆయా విషయాలపై తాము ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమకు న్యాయం జరుగకుంటే తాము సుప్రీంకోర్టు వరకైనా వెళ్తామని వెల్లడించారు.