నర్సంపేట, ఫిబ్రవరి 23 : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు క్రీడోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం నర్సంపేటలో ఈ మేరకు కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ స్థాయి క్రీడలను నిర్వహిస్తామన్నారు. ఈనెల 27న మండల కేంద్రాల్లో పోటీలు ప్రారంభమవుతాయని, మార్చి 5న నర్సంపేటలో డివిజన్ స్థాయి క్రీడలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కబడ్డీ, ఖోఖో, తాడు లాగుట, రన్నింగ్, రంగోలి పోటీలు ఉంటాయని, మహిళలు 24వ తేదీలోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
కబడ్డీ, ఖోఖో, తాడు లాగుట పోటీల్లో మండల స్థాయి విజేతలకు రూ.10 వేల ప్రైజ్‌మనీ, షీల్డులు అందిస్తామన్నారు. రన్నింగ్, రంగోలి పోటీల విజేతలకు రూ. 5 వేలు, రన్నరప్‌లకు రూ. 3 వేల ప్రైజ్‌మనీ, షీల్డులు అందిస్తామని వివరించారు. కబడ్డీ, ఖోఖో, తాడులాగుటలో డివిజన్ స్థాయి విజేతలకు ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ. 5 వేలు, షీల్డులు అందిస్తారని తెలిపారు. రన్నింగ్, రంగోలి పోటీల విజేతలకు రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలు, షీల్డులు అందిస్తామని ప్రకటించారు. ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పార్టిసిపేషన్ ప్రైజ్ ఇస్తామని చెప్పారు. రెండో సారి నిర్వహించనున్న క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పాల్గొన్నారు.