రాయపర్తి : వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మండలంలోని కిష్టాపురంలో మహిళలంతా గురువారం కోలాటాలు ఆడారు. గ్రామ ప్రధాన కూడలిలోని దుర్గామాత ఆలయం మీద పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. నీళ్ల బిందెలు, వేప మండలను మధ్యలో పెట్టుకుని గ్రామంలోని మహిళలు సామూహికంగా నృత్యాలు చేస్తూ వాన పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు.
మృగశిర కార్తె ముగింపు దశకు వచ్చినప్పటికీ వరుణ దేవుడు కరుణించడం లేదని, దీంతో తాము సాగు చేసుకున్న పంటలను ఎండిపోతున్నాయని పాటల్లో ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ దేవుడు కరుణించాలని కోరుతూ కోలాటమాడి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళల కోలాటం నేపథ్యంలో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.