పెద్దవంగర, మే 05 : ఒక్క ట్యాంకర్ అయినా నీళ్లు పంపియ్యండి నీళ్ల కోసం గోసపడుతున్నాం.. నెల రోజులైనా తాగునీరు అందడం లేదంటూ పెద్దవంగర మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ కాలనీవాసులు ఎంపీడీవో కార్యాలయం, బోరుబావుల వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా పంచాయతీ అధికారులతో తాగునీరు రావడం లేదంటూ చెప్పిన ఇప్పటికీ పట్టించు కోవడంలేదని, వేసవిలో తాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మెయిన్ రోడ్డు కాలనీవాసులకు మూడు బోర్లు ఉన్న వాటి ద్వారా చుక్కనీరు అందడం లేదని బోరు బావులు మోటార్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయన్నారు. అలాగే మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. బోరు బావులు, మిషన్ భగీరథ రెండిటి ద్వారా నీళ్లు అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కాలనీవాసులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీరును అందించాలని కోరుతున్నారు.