నర్సింహులపేట/దంతాలపల్లి/నర్మెట, మే 28 : ‘కాళ్లు మొక్కినా కనికరిస్తలేరు.. కాసులిచ్చినోళ్లకే కాంటా పెడుతుండ్రు.. వడ్లు తీసుకొచ్చి 43 రోజులైంది.. కాంటాలు పెట్టిన బస్తాలను కూడా తరలించడం లేదు.. వానలకు ధాన్యం తడిసి మొలకెత్తుతున్నయ్.. మా వడ్లు కొనండి సారూ’ అంటూ బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వచ్చిన తహసీల్దార్ రమేశ్ కాళ్లపై పడి ఇద్దరు మహిళా రైతులు వేడుకున్నారు.
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు కొనుగోలు కేంద్రానికి తహసీల్దార్ వచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని తిర్మతండాకు చెందిన భూక్యా ఈరి, భూక్యా గోరి ఆయన ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 43 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొస్తే తేమ చూడలేదని, పశువులు, పంది కొక్కులతో వడ్లు మట్టిలో కలిసిపోవడంతో పాటు వానకు తడిసి మొలకొచ్చాయని కన్నీరు మున్నీరయ్యారు.
అక్కడే ఉన్న రైతులు బోనస్ లేకపోయినా పర్వాలేదని.. ఉన్న వడ్లు కాంటా పెట్టాలని.. తమకు బుద్ధి వచ్చిందని, మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురామని, చెంపలు వేసుకుంటామని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. వారం రోజులుగా పడుతున్న వర్షాలకు వడ్లు మొలకెత్తుతున్నాయని, కాంటాలు పెట్టిన బస్తాలను కూడా మిల్లులకు తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులు పెడుతున్న ఇబ్బందులను వివరించారు. కాగా, రెండు మూడు రోజుల్లో కాంటాలు పెట్టిస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
45 రోజులైనా ధాన్యం కొనడం లేదని ఆగ్రహించిన రైతులు సీఎం రేవంత్‌రెడ్డి తీరును నిరసిస్తూ మొలకెత్తిన ధాన్యం బస్తాలతో దంతాలపల్లి-సూర్యాపేట రహదారిపై ఆందోళన చేపట్టారు. తడిసిన ధాన్యం, మొలకెత్తిన బస్తాలను అధికారులు తక్షణమే మిల్లులకు తరలించి ఎలాంటి కోతలు లేకుండా దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఆందోళనను అడ్డుకునేందుకు యత్నించారు. వెంటనే ఓ కానిస్టేబుల్ కాళ్లపై పడిన రైతు తమ గోడు వెళ్లబోసుకుంటున్నామని, తమను అడ్డుకోవద్దంటూ వేడుకున్నాడు.
తమ బాధను ఏ అధికారి పట్టించుకోవడం లేదని, వానకాలం ప్రారంభమైనా ధాన్యం కాంటాలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఆందోళన వద్దకు పీఏసీఎస్ సీఈవో వెంకన్న చేరుకొని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. అలాగే జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండలోని కొనుగోలు కేంద్రంలోనూ కాంటాలు కాక వర్షాలకు ధాన్యం మొలకెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వడ్లు మొలకొచ్చినయ్..
కేంద్రంల కాంటా పెడుతలేరు.. వడ్లు నింపుకుంటామంటే బస్తాలు ఇస్తలేరు. వారం రోజుల సంది కురుస్తున్న వానకు పరదాల నుంచి నీళ్లు పోయి వడ్లు మొలకొచ్చినయ్. వానకాలం వచ్చింది. నారుమడులు, దుక్కులు దున్నుకోవద్దా? చెలుక పని చేసుకోవద్దా? ఇక్కడికి వచ్చి ఉండాలా? పత్తి, మిరప గింజలు పెట్టుకోవద్లా? కొనుగోలు కేంద్రం ఎందుకు పెట్టిండ్రు. సచ్చి, బతికి వడ్లు పండించుకున్నం. 50 రోజుల సంది సీరియల్ రాలేదా మాది? ఎందుకు కాంటా పెట్టరు? ఇంకోసారి ఇక్కడికి వడ్లు తీసుకొస్తే మా చెంపమీద మేమే కొట్టుకుంటం. – భూక్యా గోరి, మహిళా రైతు, తిర్మతండా