వర్ధన్నపేట, డిసెంబర్ 18 : దొడ్డు ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ధాన్యం పంపించేందుకు కేంద్రాల నిర్వాహకులు ప్రయత్నించినా తీసుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. దీంతో రోజుల తరబడి క్రయవిక్రయాలు లేక ఇల్లంద, వర్ధన్నపేట, రాయపర్తితో పాటు జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లోనే దొడ్డు ధాన్యం పేరుకుపోతుండగా రైతులు 15 రోజులుగా అక్కడే పడిగాపులు పడుతున్నారు.
మిల్లర్లు దొడ్డు ధాన్యం తీసుకోకపోవడంతో తూకం కూడా వేయడంలేదు. కేవలం సన్న వడ్ల ను మాత్రమే మిల్లులకు తరలిస్తున్నారు. ఒక్క ఇల్లంద మార్కెట్లోనే సుమారు 2,500 బస్తాల ధాన్యం తూకం వేయాల్సి ఉంది. అంతేకాక వర్ధన్నపేట, రాయపర్తి కేంద్రాల్లో కూడా సుమారు 50 లారీల మేరకు ధాన్యం తూకం వేయాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. గురువారం ఇల్లంద మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు ఆందోళన నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దొడ్డు ధాన్యం క్రయవిక్రయాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
అధికారులు పట్టించుకుంటలేరు..
దొడ్డు ధాన్యం తూకం వేయకపోవడంతో 15 రోజులుగా మార్కెట్లో ఇబ్బందులు పడుతున్నం. అధికారులు కనీసం పట్టించుకుంటలేరు. సన్న వడ్లకే కాంటా లు పెడుతాండ్లు. దొడ్డుయి ఆడనే ఉంచుతాండ్లు. దీంతో రోజు మార్కెట్కు వచ్చి పోతున్నం. సన్న వడ్లకు కూడా కాంటాలు వేయొద్దని గొడవకు దిగి ఆపించినం. అధికారులు స్పందించి దొడ్డు ధాన్యాన్ని కూడా కాంటాలు వేయించి మిల్లర్లు తీసుకునేలా చూడాలి.
– పుట్ట సూరయ్య, రైతు, ఇల్లంద
ఇరవై రోజులైతాంది
ఇల్లంద మార్కెట్కు దొడ్డు ధాన్యం తెచ్చి 20 రోజులైతాంది. కేవలం సన్న రకం వడ్లు మాత్రమే కాంటాలు వేసి మిల్లులకు పంపుతున్నరు. మిల్లర్లు ధాన్యం తీసుకోవడంలేదని నిర్వాహకులు తూకాలు వేయకపోవడంతో రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. నిబంధనల ప్రకారం తూర్పార పట్టి నిల్వ ఉంచినం. అధికారులు స్పందించి వెంటనే తూకం వేయించాలె.
– మునుకుంట్ల కొమురయ్య, రైతు, ఇల్లంద