అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్లో ఫుల్ జోష్ నెలకొంది. ఎన్నికలకు నాలుగు నెలల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పేర్లు ఖరారు చేయడం, అందులోనూ దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వడం శ్రేణుల్లో సంతోషం నింపింది. దీంతో మంగళవారం ఏ సెగ్మెంట్లో చూసినా మద్దతు ర్యాలీలు, పటాకుల మోతలు, స్వీట్ల పంపిణీ, శుభాకాంక్షలతో కోలాహలం కనిపించింది. గెలుపు తథ్యం.. మెజార్టీయే లక్ష్యమంటూ తమ అభిమాన నేత విజయాన్ని కాంక్షిస్తూ సంబురాల్లో మునిగితేలుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 22
ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి హైదరాబాద్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ సహా ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలందరినీ కలిశారు. తన పేరు ఖరారు చేసేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
తనకు మరోసారి మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఖరారైన సందర్భంగా ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మంత్రి సత్యవతిరాథోడ్‌ను, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, ఎమ్మెల్సీ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరిని వారి వారి నివాసాల్లో పాల్వాయి రామ్మోహన్‌రెడ్డితో కలిసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసారి వచ్చిన ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియానాయక్‌కు బయ్యారంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికాయి. వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి మంగళహారతులు పట్టి పూలవర్షం కురిపించారు. అత్యధిక మెజార్టీతో ఇల్లెందులో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించి చరిత్ర తిరగరాస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టంచేశారు.
హనుమకొండలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను నియోజకవర్గంలోని నాయకులు, అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. కుడా చైర్మన్ సుందర్రాజ్, రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకన్న, గ్రంథాలయ చైర్మన్ ఆజీజ్ఖాన్ సహా పలువురు పుష్పగుచ్ఛాలు అందించి తమ సంపూర్ణ మద్దతు అందించి గెలిపించుకుంటామని చెప్పారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని శ్రేణులు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా గణపురం మండలం గాంధీనగర్ వద్ద ఘన స్వాగతం పలికి 500 బైక్‌లతో జిల్లాకేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి వెంట పటాకులు కాల్చుతూ మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయే అంటూ నినాదాలు చేస్తూ ముందుకుసాగారు.
పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్‌ను భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి-రాకేశ్ దంపతులు, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కలిసికట్టుగా కృషిచేస్తామన్నారు.
అభ్యర్థులు ఖరారు కావడంతో మంగళవారం ఉమ్మడి వరంగల్ అంతటా బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు హోరెత్తాయి. తమ నేతలకు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వారితో క్యాంప్ కార్యాలయాలు సందడిగా కనిపించాయి.
వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని పలువురు బీఆర్ఎస్ నేతలు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని పైడిపల్లి, పర్వతగిరి, తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌ను బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కలిసి శుభకాంక్షలు తెలిపారు. డప్పుచప్పుళ్ల నడుమ పటాకులు కాల్చుతూ భారీ ర్యాలీ తీశారు.