ములుగు, అక్టోబర్ 28(నమస్తేతెలంగాణ) : వైద్య, ఆరోగ్య, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీఎస్టీ పేరుతో వేతనాల్లో కోత పడనుందా? జీఎస్టీ పేరుతో 5 శాతం కటింగ్ కానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇందుకు ఉదాహరణగా ములుగు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సబ్ సెంటర్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలకు ఇటీవల కోతలు విధించి వేతనాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాం లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన నెలకు రూ. 25,600 వేతనంతో తొమ్మిది మంది ఏఎన్ఎంలను నియమించారు.
అప్పటి నుంచి వారికి కాంట్రాక్టు ఏజెన్సీ క్రమం తప్పకుండా అంతే మొత్తంలో జీతం చెల్లిస్తూ వస్తున్నది. గత ఆరు నెలలుగా వీరికి వేతనాలు విడుదల కాలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించిన వేతనాలు విడుదల చేయగా, శ్రీలక్ష్మీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఒక్కో ఏఎన్ఎంకు మూడు నెలలకు రూ. 5 వేలు తగ్గించి పంపిణీ చేసింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకుడు ఉపేందర్‌ను ఏఎన్ఎంలు నిలదీయగా ప్రభుత్వం నుంచే జీఎస్టీ కట్ చేసి వేతనాలు విడుదల చేశారని, వాటిని తగ్గించి ఇచ్చినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని అకౌంటెంట్ తిరుపతిరెడ్డికి తెలుపగా ఇక నుంచి ప్రతి నెలా జీఎస్టీ మినహాయించుకొనే వేతనాలు చెల్లిస్తామని, అన్ని జిల్లాల్లో ఈ పద్ధతి అమల్లోకి వస్తుందని చెప్పినట్లు ఏఎన్ఎంలు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి కటింగ్‌లు లేకుండా వేతనాలివ్వాలని కోరుతున్నారు.