పరకాల/ఆత్మకూరు/దామెర, మార్చి 1: ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని, జై తెలంగాణ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మేడిగడ్డకు వెళ్తూ మార్గమధ్యలో ‘అగ్రంపహాడ్ ఘటన’లో పోలీసు బాధిత బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులను నగర శివారులోని ఎన్ఎస్ఆర్ హోటల్లో ఆయన పరామర్శించారు. అనంతరం వారి నుంచి వివరాలు తెలుసుకొని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘జై తెలంగాణ’ నినాదాన్ని నిషేధించారా అని ప్రశ్నించారు. జై తెలంగాణ అంటే అక్రమ కేసులు బనాయించి, దేశ ద్రోహుల్లాగా రాత్రికి రాత్రే అరెస్టు చేసి చిత్రహింసలు పెడతారా అని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు.
జాతరలో పోలీసులు వ్యవహరించిన తీరుపై లోతైన విచారణ జరిపించాలని కేటీఆర్, వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝాను కోరారు. ఈ విషయమై కేటీఆర్, సీపీకి ఫోన్ చేశారు. ఆత్మకూరు ఎస్సై ప్రసాద్‌పై వేటు వేసినప్పటికీ కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి అధికారిపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.
పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ తాము అండగా నిలుస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులకు నిర్బంధాలు కొత్తేమీ కాదని, పార్టీ బలోపేతానికి శ్రమించే ప్రతి గులాబీ సైనికున్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి న్యాయం జరిగేందుకు కొట్లాడతామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పార్టీ చూస్తూ ఊరుకోదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.