చేనేత రంగానికి జీఎస్టీ గుదిబండగా మారింది. ఐదు శాతం పన్నుతో ఈ రంగం మనుగడ కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. జీఎస్టీతో ధరలు పెరిగి సంఘాలు ఊబిలోకి నెట్టివేయబడ్డాయి. అయితే కేంద్రం జీఎస్టీ స్లాబ్‌లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో చేనేత రంగానికి జీఎస్టీ నుంచి విముక్తి లభిస్తుందా.. అని ఉమ్మడి జిల్లా కార్మికులు ఎదురుచూస్తున్నారు.
– శాయంపేట, ఆగస్టు 31
వరంగల్ జిల్లాలో 29 చేనేత సంఘాలు, 1439 జియోట్యాగ్ చేయబడిన మగ్గాలున్నాయి. 1221 మంది అనుబంధ కార్మికులున్నారు. మొత్తంగా 2660 మంది చేనేత కార్మికులు వృత్తి పనిచేస్తున్నారు. ప్రధానంగా బెడ్‌షీట్స్, నవారు, దర్రీస్, పాలిస్టర్ క్లాత్, పట్టా కార్పెట్డోర్ మ్యాట్స్ ఉత్పత్తి చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 16 చేనేత సంఘాలు, జియోట్యాగ్ చేసిన మగ్గాలు 418 ఉండగా, చేనేత, అనుబంధ కార్మికులు 791 మంది ఉన్నారు. టవల్స్, లుంగీలు, షర్టింగ్, షూటింగ్స్, డ్రెస్ మెటీరియల్, హిమ్రు, ఆర్మూర్ సారీస్, చేతి రుమాల్లు, నవారు, దర్రీస్, లెనిన్షర్టింగ్స్ ఉత్పత్తి చేస్తున్నారు.
జనగామ జిల్లాలో 11 సంఘాలుండగా 3500 మంది కార్మికులు, భూపాలపల్లి జిల్లాలో 7 సంఘాలుండగా వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేనేత ద్వారా ఏటా సుమారు రూ. 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. వీరు తయారు చేసిన ఉత్పత్తులను టెస్కోకు విక్రయిస్తున్నాయి. టెస్కో వరంగల్‌లో మూడు, భద్రాచలంలో ఒకటి, కొత్తగూడెంలో ఒకటి, ఖమ్మంలో ఒక షోరూంలో వస్ర్తాలను విక్రయిస్తున్నారు.
త్వరలో హనుమకొండతో షోరూంను తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆర్డర్లపై తయారయ్యేది అంతా ప్రభుత్వ శాఖలకు వెళ్తుంది. షోరూంల్లో పట్టుచీరెలు, లుంగీలు ఇతరత్రా విక్రయాలు చేస్తున్నారు. అయితే విక్ర యాలపై జీఎస్టీ తీవ్ర ప్రభావం పడుతోందంటున్నారు. యేడాదికి సుమారు రూ.10లక్షలు జీఎస్టీ రూపంలో సంఘాలు కోల్పోతున్నట్లు చెబుతున్నారు. సంఘాలు కేవలం పది శాతం ప్రాఫిట్‌తో విక్రయాలు చేస్తున్నారు.
జీఎస్టీతో ధరలు పెంచుతున్నారు. దీని వల్ల లాభాలు లేకపోవడం, జీఎస్టీ భారంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతున్నారు. టెస్కో కొనుగోలు దుకాణాల్లో వస్ర్తాలకు రాయితీ ఇస్తున్నారు. కానీ రాయితీ కంటే జీఎస్టీ భారమే ఎక్కువ అంటున్నారు. ఈ క్రమంలో జీఎస్టీ రద్దు చేయడం వల్ల ధరలు తగ్గి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. తద్వార సంఘాలకు ఆర్థికంగా చేయూత ఇచ్చినట్లయితది. కేంద్రం జీఎస్టీ స్లాబ్‌లు మారుస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో చేనేత రంగంపై ఆధారపడ్డ వారు ఆశ తో ఉన్నారు. 12, 28 శాతం స్లాబ్‌లను ఎత్తివేయాలని మంత్రుల బృందం ఆమోదించింది. ఈ నేపథ్యంలో కొన్నింటి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.
చేనేతపై జీఎస్టీని తొలగించాలి..
చేనేత రంగంపై ఎనిమిదేళ్లుగా ఐదు శాతం జీఎస్టీ వేస్తున్నారు. సంఘం పై లక్షల రూపాయలు చెల్లిస్తున్నాం. పన్ను భారంతో వస్త్రం ధర పెరుగుతున్నది. దీంతో ప్రైవేటు మార్కెట్ కంటే ధర ఎక్కువగా ఉంటున్నది. దాని వల్ల విక్రయాలు లేక ఇబ్బంది పడాల్సి వస్తున్నది. చేనేతపై ఎందుకు జీఎస్టీ వేశారో అర్థం కావడం లేదు. జీఎస్టీ వల్ల సంఘాలు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తున్నది. ఐదు శాతం స్లాబ్‌లో ఉన్న చేనేత రంగానికి పూర్తి పన్ను తొలగించి ఆదుకోవాలి.
-బూర లక్ష్మీనారాయణ, సొసైటీ ఉపాధ్యక్షుడు, శాయంపేట