జనగామ, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)/దేవరుప్పు ల : జనగామ సబ్ జైలులో ఏం జరిగింది?.. రిమాండ్ ఖైదీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?.. అనేది తెలియడం లేదు.. అయితే అధికారులు, వార్డెన్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిన్న చిన్న కేసులతో వచ్చిన అండర్ ట్రయల్స్ మానసిక స్థితిని సరిగా అంచనా వేయలేక, రసాయనాలతో మరుగుదొడ్లు కడిగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జైలులో మల్లయ్య బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది.
వివరాలిలా ఉన్నాయి.. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లయ్య అలియాస్ మల్లేశ్ (38)కు సెప్టెంబర్ 23న గ్రామంలో స్నేహితుడు పడకంటి బ్రహ్మచారితో జరిగిన స్వల్ప ఘర్షణలో పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 8న కోర్టులో హాజరు పరుచగా రిమాండ్ విధించడంతో జనగామ సబ్ జైలుకు తరలించారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం సాయంత్రం బ్లీచింగ్ పౌడర్‌ను నీళ్లలో కలుపుకొని మల్లయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అధి కారులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అం దించి గుట్టుచప్పుడు కాకుండా వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందిన తర్వాత ఆదివారం బంధువులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
మల్ల య్య మృతిపై అనుమానాలున్నాయని, పోలీసులు, జైలు అధికారులకు బ్రహ్మచారి డబ్బులిచ్చి బలవంతంగా బ్లీచింగ్ పౌడర్ తాగించి చంపారని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆదివా రం జనగామ సబ్ జైలు ఎదుట ధర్నా చే పట్టారు. పోలీసులు, జైలు వార్డర్లు, జైలర్‌పై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య హైమ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు ఫిర్యాదు చేశారు. కాయకష్టంతో కుటుంబాన్ని పోషించే మల్లయ్య మృతితో వారి కుటుంబం వీధిలో పడింది. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం హైమ గర్భవతి. మల్లయ్య మరణ వార్త తెలిసిన ఆమె బోరున విలపి స్తోంది. ఇద్దరు చిన్నారులు ఏం జరిగిందో తెలియక తల్లిని అనుసరిస్తూ ఏడుస్తున్న దృశ్యం పలువురిని కలిచి వేస్తున్నది.
జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారితో వెట్టిచాకిరీ చేయించవచ్చా?.. క్షణికావేశంలో చిన్నచిన్న తప్పులు చేసి 14 రోజుల స్వల్పకాల రిమాండ్‌కు వచ్చిన వారి మానసిక స్థితిని అంచనా వేయకుండానే వారి చేతికి యాసిడ్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి ప్రాణాలు తీసే వాటితో మరుగుదొడ్లు కడిగించవచ్చా? జైలు నియమనిబంధనలు ఏం చెబుతున్నాయ్ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అండర్ ట్రయల్ ఖైదీల కదలికలపై సంబంధిత జైలు అధికారి పర్యవేక్షణ ఏమైంది? వారితో ఏమైనా పనులు చేయిస్తే వారి వెన్నంటి ఉంటూ ఇద్దరు వార్డర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ జనగామ సబ్ జైలులో ఖైదీలపై నిఘా అసలే ఉండదని తెలుస్తున్నది. వార్డర్లను ప్రసన్నం చేసుకుంటే జైలులోకి ఫోన్లు, సిగరెట్లు ఇంకా ఏం కావాలంటే అవి రెక్కలు కట్టుకొని వస్తాయని రిమాండ్ ఖైదీలుగా ఉండి బయటకు వచ్చిన వారు చెబుతున్నారు. ఇక్కడ జైలర్‌ను వార్డర్లు లెక్క చేయడం లేదని అంటున్నారు. మొత్తానికి అధికారులు, వార్డర్ల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణం పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.