‘ధాన్యమో.. రామచంద్రా.. ఇంకెప్పుడు ధాన్యం కొంటారు’ అంటూ అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కులేక దిగాలు చెందుతున్నారు. సర్కారు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో కాంటాలు పెట్టక.. తరలించేందుకు లారీలు రాక రోజుల తరబడి పడిగాపులుగాస్తున్నారు. మరోపక్క అకాల వర్షాలతో ఆగమవుతూ కంటిమీద కనుకులేకుండా గడుపుతున్నారు. పట్టించుకునే దిక్కులేక చివరికి దళారులను ఆశ్రయించి, తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారు.
నర్సింహులపేట, మే 10 : ‘దళారులకు ధాన్యం అమ్ముకొని మోస పోవద్దు’ అని పదేపదే ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చెబుతున్న మాటలు నీటి మూటలే అవుతున్నాయి. సర్కారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే.. సకాలంలో కొనుగోళ్లు జరగడం లేదు. కాంటాలు పెట్టడంలో ఆలస్యం.., లారీలు రాక రోజుల తరబడి కేంద్రంలో తిండీ తిప్పలు మాని రైతులు పడిగాపులు గాయాల్సివస్తున్నది. దీనికి తోడు అప్పుడప్పుడు కురుస్తున్న అకాల వర్షాలకు వడ్లు తడిసి, రంగుమారి నష్టపోతున్నారు.

ఇన్ని అవాంతరాలతో సతమతమవుతున్న అన్నదాతలు చివరి దిక్కుతోచని స్థితిలో దళారులను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారు. కాంటాలు పెట్టినా రోజుల తరబడి లారీలు రాకపోవడంతో వడ్ల బస్తాలు తడవకుండా టార్పాలిన్లు కప్పి కాపలా ఉండాల్సిన వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అవసరమైయితే వాహనం ఏర్పాటు చేసుకొని మిల్లుకు తీసుకపోవాలని కొందరు నిర్వాహకులు ఉచిత సలహాలు ఇస్తున్నారని రైతులు చెబుతుఆన్నరు. లారీలు రాక, కాంటాలు వేయక రోజుల తరబడి వడ్లు వర్షానికి తడవకుండా కాపాడుకుంటున్నామని, ఇంత కష్టపడినా మద్దతు ధర వస్తుందో లేదోననే రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇక కొనుగోలు కేంద్రాల్లో కనీసం తాగునీరు, టెంట్లు, టార్పాలిన్ కవర్లు లేక పోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొన్ని కొనుగోలు కేంద్రాలు నీరు నిలిచే ప్రదేశంలో ఉండడంతో భయపడుతున్నారు. ధాన్యం కాంటాలు జాప్యం కావడంతో దళారులు రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని కొనుగోలు కేంద్రాల్లోనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ఈ విషయంపై సీఈవో వెంకన్న మాట్లాడుతూ.. కాంటాలు త్వరగా పెట్టిస్తామని, లారీలు రావడం ఆలస్యమవుతున్నందున రైతులు ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుంటే బస్తాలు మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
బస్తాలు తరలించక ఇబ్బంది పడుతున్నాం..
కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెల కావొస్తున్నది. 420 బస్తాలు 10 రోజుల కిందట కాంటలు పెట్టిండ్లు. లారీలు రావడం లేదని బస్తాలు తరలించడం లేదు. అకాల వర్షాలతో భయపడుతున్నాం. బస్తాలు తడువకుండా చూడాల్సిన బాధ్యత మాదే కావడంతో టార్పాలిన్లు తీసుకొచ్చి జాగ్రత పడుతున్నాం. అయినా గట్టి వాన వస్తే నీళ్లు కింద నుంచి పోయే అవకాశం ఉంది. రోజుల కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నాం. బస్తాలను తొందరగా తరలించాలి.
– అజ్మీరా వంశీ గోపతండా
కొనుగోలు కేంద్రాల్లో దళారుల పాగా..
ఇలా ఒక రైతును చూసి మరో రైతు వడ్లను అమ్ముకొని నష్టపోతున్నారు. తొర్రూరు డివిజన్ పరిధిలో యాసంగి సీజన్లో సుమారు 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రంలో 1,18,632 బస్తాలకు మాత్రమే కాంటా వేయగా, అందులో 46, 926 బస్తాలను మాత్రమే మిల్లులకు తరలించారు. 71,756 బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంకో 15 లక్షల బస్తాలు కాంటాలు వేయాల్సి ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. వెంటనే గన్నీ బ్యాగులు, లారీలు అందుబాటులో ఉంచి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.