మహదేవపూర్ (కాళేశ్వరం), మే 12 : సరస్వతీ పుష్కరాలకు వచ్చే సామాన్యులకు కనీస సౌకర్యాలు అక్కర్లేదా? అని మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నెల 15 నుంచి 26 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ చేపట్టిన పనులను సోమవారం ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మధూకర్ మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో పుషరాలు ప్రారంభం కానుండగా ఎకడ కూడా పనులు పూర్తి కాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేనే మంత్రిగా ఉన్నారని, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారని, ఇద్దరూ కలిసి సరస్వతీ పుషరాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి ఒడ్డున సరస్వతీ అమ్మవారి మండపాన్ని చూస్తే పుషర పనులు ఎలా చేస్తున్నారో అర్థమవుతుందన్నారు.
ఈ పుషరాలు గతంలో రాజమండ్రిలో మాత్రమే జరిగేవని, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ డిమాండ్ మేరకు కాళేశ్వరం వద్ద 2013లో ఘనంగా జరుపుకున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి జరుపుకునే పుషరాలపై స్థానిక ఎమ్మెల్యే పట్టింపులేకుండా ఉన్నారన్నారు. పుషరాల నిర్వహణపై ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎమ్మెల్యే పలుసార్లు సమీక్షలు నిర్వహించినప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు.
పుషరాలకు లక్షలాదిగా తరలివచ్చే సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని, స్నానాలు చేసేందుకు వసతులు లేవని, టాయిలెట్లు, అపరకర్మ మండపం పూర్తికాలేదన్నారు. కేవలం వీఐపీల కోసం మాత్రమే పనులు పూర్తి చేశారని, ఈ పుషరాలకు సామాన్యులను అనుమతిస్తారా? లేదా? అనే అనుమానాలున్నాయన్నారు. పనులను నైపుణ్యం లేనివాళ్లకు అప్పగించారని, అధికారులు నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేసేందుకు భయపడుతున్నారని అన్నారు.
కమీషన్ల కోసమే పలుమార్లు రివ్యూ మీటింగ్‌లు పెట్టారని, అందువల్లే నాణ్యత లేకుండా పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. జరిగిన పనులకు నాణ్యతా పరీక్షలు నిర్వహించాలని, నిధులు, పనులు, టెండర్ల జారీ ప్రక్రియపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పుషరాలకు వచ్చే సామాన్యులకు సైతం పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో తాము బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మధూకర్ హెచ్చరించారు.
ఆయన వెంట రాష్ట్ర యువజన నాయకుడు జకు రాకేశ్, పార్టీ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, మహదేవపూర్, కాళేశ్వరం మాజీ సర్పంచులు శ్రీపతి బాబు, వెన్నపురెడ్డి వసంతా మోహన్‌రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఒడేటి స్వప్నా మల్లారెడ్డి, కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయ మాజీ చైర్మన్ పోత వెంకటస్వామి, మండల యూత్ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్, కూరతోట రాకేశ్, కారెంగుల బాపురావు తదితరులు పాల్గొన్నారు.