నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జిల్లాలో శనివారం సాయంత్రం పలుచోట్ల గాలివాన వర్షం కురిసింది. వరుస వర్షాలతో రైతుల్లో వణుకు పుడుతోంది. జనగామ జిల్లా కొడకండ్లలోని వ్యవసాయ మార్కెట్లో టార్పాలిన్లు లేక ఆరబోసిన ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జఫర్గఢ్ మండలం తిమ్మంపేటలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీటిపాలైంది.
రాయపర్తి మండలం కొం డాపురంలో బండారి సురేందర్ ఇంటి ఆవరణలో చెట్టు విరిగి విద్యుత్లైన్పై పడడంతో స్తంభం నేలకూలింది. పిడుగుపాటుకు మహబూబ్నగర్లో రైతు ఎల్కపల్లి యాకయ్యకు చెందిన రూ.65 వేల విలువైన దుక్కిటెద్దు మృతిచెందింది. ఇక హనుమకొండలో ఉదయం ఎండ దంచికొట్టగా మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో వర్షం పడి భిన్నమైన వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా వాన పడడంతో రోడ్లు జలమయమవగా వాహనదారులు తడిసిముద్దయ్యారు.
కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలాడు..
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని కోనాపూర్ కొ నుగోలు కేంద్రంలో శనివారం పిడుగు పడి హమాలీ కార్మికుడు బిట్టు(30) అక్కడికక్కడే మృతిచెందాడు. కూలీలంతా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిది బీహార్ రాష్ట్రం శాలన్పూర్ ప్రాంతం కాగా, అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.