ఖిలావరంగల్, ఏప్రిల్ 19: దేశంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లోని కార్మిక భవనంలో బుధవారం ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు గొప్ప పాలన అందిస్తోందన్నారు. కార్యకర్తలు పట్టుదలతో పనిచేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని సూచించారు. పనిచేసిన కార్యకర్తలకు పార్టీ, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరం కలిసి కట్టుగా పనిచేద్దామన్నారు. అన్ని రంగాల్లో నియోజకవర్గం దూసుకుపోతోందన్నారు. విద్య, వైద్యంలో ముందున్నామని పేర్కొన్నారు.
అలాగే, బస్ స్టేషన్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వీధుల్లో సీసీ రోడ్లు, కార్మిక, కమ్యూనిటీ భవనాలు, అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణాలు, ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో గొప్పగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అక్కసుతో దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వాటిని కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 28 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించారని, ఈ సారి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు ఓరుగల్లు ప్రజల తరఫున బహుమతి అందజేద్దామన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సమావేశంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, డివిజన్ అధ్యక్షుడు పగడాల సతీశ్, కలకొండ అభినాష్, నూతన్, రెడ్డి కృష్ణ, మంచాల కృష్ణమూర్తి, మంద మహేందర్, మనోజ్‌గౌడ్, నామని రాజ్‌కుమార్, పోలెపాక నరేందర్, మంద అక్షిత్పటేల్ పాల్గొన్నారు.
కరీమాబాద్: కార్యకర్తలను బీఆర్ఎస్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 32వ డివిజన్లో కార్పొరేటర్ పల్లం పద్మ అధ్యక్షతన డివిజన్లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పని చేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్ పల్లం పద్మ, డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, మాజీ కార్పొరేటర్లు పల్లం రవి, నాగపురి కల్పన, నాగపురి శోభ, నాయకులు మోడెం ప్రవీణ్, నాగపురి సంజయ్‌బాబు, బొల్లం రాజు, కొండ రాజు పాల్గొన్నారు.