జననేత కేసీఆర్ కోసం దారులన్నీ ఏకమై.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు జాతరలా జనగామకు తరలివచ్చారు. లక్షలాది మంది సభకు హాజరై సీఎం ప్రసంగిస్తున్నంత సేపు ఈలలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు.
– బచ్చన్నపేట, ఫిబ్రవరి 11
పల్లె, పట్నం నుంచి తరలివచ్చిన జనంతో జనగామ పోటెత్తింది. నెత్తిన బతుకమ్మలు, ఒగ్గు డోలు విన్యాసాలు, డప్పుచప్పుళ్ల నడుమ ఊరువాడ నుంచి జాతరవోలె కదిలివచ్చిన అశేష జనంతో యశ్వంతాపూర్ సభా ప్రాంగణం నేల ఈనిందా అన్నట్టు కనిపించింది. హెలిప్యాడ్ నుంచి కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వరకు గుస్సాడీ, లంబాడీ, కోయ, చిందుయక్షగానం, ఒగ్గుడోలు వంటి వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ కేసీఆర్‌ను ఘనంగా స్వాగతించారు. కేసీఆర్ సభా వేదిక పైకి చేరుకొని అభివాదం చేసి, మాట్లాడుతున్నంత సేపు జనం ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ ముందుగా అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ వేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రసంగించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. సుమారు గంట సేపు సభలో పాల్గొన్న ముఖ్యమంత్రికి అడుగడుగునా నీరాజనం పలికారు. జిల్లా ప్రజల కోరిక మేరకు మెడికల్ కళాశాల మంజూరు చేయాలా అని పదే పదే అడిగి మంజూరు చేస్తామని హమీ ఇవ్వడంతో ముత్తిరెడ్డి ఉత్సాహంతో వేదికపైనే రెండు స్టెప్పులు వేశాడు. ప్రముఖ తెలంగాణ గాయకుడు సాయిచంద్ పాడిన పాటలు హోరెత్తించగా ప్రజలు చప్పట్లు కొడుతూ ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆటాపాటలతో వేదిక దద్దరిల్లింది. సభలో బీజేపీపై, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ‘మీరంతా మా వెంట ఉంటామంటే మీ కోసం ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు సిద్ధం’ అని ప్రకటించడంతో ప్రజల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఇలా జనగామ సభ సక్సెస్‌తో అటు మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, తాటికొండ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తన పుట్టిన రోజున జనగామలో సభ పెట్టడం, కేసీఆర్ సార్ రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇది జీవితంలో మరువలేని రోజన ముత్తిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు మెడికల్ కళాశాల మంజూరు ప్రకటించి, రెండు రోజుల్లో జీవో ఇస్తామని చెప్పడం తన సంతోషం కలిగించిందన్నారు.