నయీంనగర్, ఫిబ్రవరి 22 : వరంగల్ నిట్‌లో సైన్స్ వీక్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 సంవత్సరాల భారతదేశ విజయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇక్కడ వారం పాటు నిర్వహించే వేడుకలు పండుగ వాతావరణంలో మొదలయ్యాయి. తొలిరోజు అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బి.జె. రావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సైన్స్ ప్రయోగాలు, అటవీ శాఖ ప్రదర్శన, పుస్తక ప్రదర్శనలను ప్రారంభించి ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా విజ్ఞాన ప్రచారంలో నిట్ కృషిని ఆయన అభినందించారు.
– హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ బి.జె.రావు
సాంకేతిక అభివృద్ధి చెంది జీవనశైలి పూర్తిగా మారిన తరుణంలో విద్యార్థులు, యువకులు తమ నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని హెచ్‌సీయూ వీసీ బి.జె. రావు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఏదైనా అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో చూడాలని చెప్పారు. తరగతి గదికే పరిమితం కాకుండా అవగాహన, అభ్యాసాన్ని విస్తరించుకోవాలని సూచించారు. అలాగే స్వతంత్ర అభిప్రాయాన్ని కలిగి సొంత లక్ష్యాన్ని అన్వేషించుకొని ముందుకుసాగాలని సందేశమిచ్చారు.
వైజ్ఞానిక వారోత్సవాలు తొలిరోజు ఘనంగా జరిగాయి. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శనలను తిలకించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పుస్తక ప్రదర్శనలను, వైజ్ఞానిక చలనచిత్రాలను ఉత్సాహంగా తిలకించారు. వివిధ విభాగాల నిట్ అధ్యాపక బృందం చేసిన సైన్స్ ప్రయోగాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇలా ప్రదర్శనలు చూసేందుకు వచ్చిన విద్యార్థులతో నిట్ సందడిగా మారింది.
‘విజ్ఞాన్ ప్రసార్ పర్యవేక్షణలో స్కోప్ (సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్) వేదిక ద్వారా ‘శాస్త్ర విజ్ఞానం.. సర్వత్రా శ్లాఘనీయం’ నినాదంతో ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు ప్రచార వారోత్సవ మహోత్సవానికి వరంగల్ నిట్ ప్రాతినిధ్యం వహించింది. నిట్‌లో సీనియర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కే లక్ష్మారెడ్డి నేతృత్వంలో స్కోప్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సమన్వయకర్తగా కెమిస్ట్రీ విశ్రాంత ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య వ్యవహరిస్తున్నారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మార్గదర్శకంలో స్కోప్ కింద ఎన్నో వినూత్న కార్యక్రమాలు, ఉపన్యాసాలు నిర్వహించబడుతున్నాయి. స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా తెలుగు రాష్ర్టాల్లో జరిగిన శాస్త్ర, సాంకేతిక ప్రగతి గురించి తెలుగు ప్రజల్లో ఉత్తేజం నింపడం.. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు నిట్ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ వారోత్సవం.’
భారత ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి, సమాజంపై సైన్స్ ప్రభావం ఎంతో ఉందని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. అనేక శాస్త్రీయ ఆలోచనలను స్థానిక భాషల్లోకి అనువదించేందుకు గాను స్కోప్ ప్రాజెక్ట్‌ను ఒక బాధ్యతగా తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే సైన్స్, శాస్త్రవేత్తలపై ఎక్స్పో ఏర్పాటుచేశామని దేశ నిర్మాణంలో శాస్త్ర సాంకేతిక ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకునేందుకు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సైన్స్ వీక్ ఫెస్టివల్ ప్రాముఖ్యత, ఆవశ్యకతను ప్రొఫెసర్ కే లక్ష్మారెడ్డి వివరించారు. ప్రాజెక్ట్ సమన్వయకర్త ప్రొఫెసర్ రామచంద్రయ్య స్కోప్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశాన్ని, కార్యకలాపాలను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కృష్ణానందం, ఆంజనేయులు, కాశీనాథ్, రిజిస్ట్రార్, డీన్లు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక బృందం, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.